Basavaraj Bommai: జేడీఎస్‌తో ఎన్నికల అవగాహనపై బొమ్మై ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2023-06-13T19:41:51+05:30 IST
లోక్‌సభ ఎన్నికల్లో జనతా దళ్ సెక్యులర్ తో ఎన్నికల అవగాహన సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు జరగలేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. అయితే రాజకీయాల్లో మునుముందు ఏం జరుగుతుందో ఊహించి చెప్పడం కష్టమని అన్నారు.
హుబ్బళ్లి: లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) జనతా దళ్ సెక్యులర్ (JDS)తో ఎన్నికల అవగాహన సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు జరగలేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) తెలిపారు. అయితే రాజకీయాల్లో మునుముందు ఏం జరుగుతుందో ఊహించి చెప్పడం కష్టమని అన్నారు. హుబ్బలిలో మంగళవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీలన్నీ ఏకం కానున్నట్టు మీడియాలో జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు.
''రాష్ట్ర స్థాయిలో అయితే ఇంతవరకూ ఎలాంటి చర్చలు జరగలేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ముందే ఊహించి చెప్పలేం'' అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బొమ్మై చెప్పారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెలవడిన తర్వాత జేడీఎస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ఆలోచిస్తోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సైతం ఇటీవల ఢిల్లీ పర్యటనలో పలువురు బీజేపీ నేతలను కలుసుకున్నారు. ఆసక్తికరంగా, సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సందర్భం వచ్చినప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అవగాహనకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతానికైతే పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఏదీ తనకు లేదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. బీజేపీ బలపరచని ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా గెలిచాడు. కాంగ్రెస్, జేడీఎస్ చెరో సీటు గెలుచుకున్నాయి.