2024 Lok Sabha Elections : ప్రతిపక్షాలకు నవీన్ పట్నాయక్ గట్టి ఝలక్
ABN, First Publish Date - 2023-05-11T20:48:12+05:30
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఒడిశా ముఖ్యమంత్రి,
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ (BJD) చీఫ్ నవీన్ పట్నాయక్ గట్టి ఝలక్ ఇచ్చారు. తమ పార్టీ ప్రతిపక్షాలతో కలిసి పని చేసే అవకాశాలు లేవని, తమ పార్టీ ఒంటరిగానే వెళ్తుందని, ఇది తమ శాశ్వత ప్రణాళిక అని చెప్పారు. ఆయన గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని చెప్పారు.
ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడారు. బీజేడీ సమాన దూరాన్ని పాటిస్తోందా? అని ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, ‘‘ఎల్లప్పుడూ అదే మా వ్యూహం’’ అని చెప్పారు. భువనేశ్వర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పురి నగరానికి మార్చాలని మోదీని కోరానని చెప్పారు. సాధ్యమైన అన్ని విధాలుగానూ దీనికి సాయపడతానని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఢిల్లీ పర్యటనలో ఇతర రాజకీయ పార్టీల నేతలను కలవాలనే ఆలోచన తనకు లేదని చెప్పారు.
బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA)తోనూ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలతోనూ నవీన్ పట్నాయక్ సమాన దూరాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీరు సమీప భవిష్యత్తులో మారే అవకాశం లేదని నవీన్ చెప్పారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీతో ముఖాముఖి పోటీలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండు రోజుల క్రితం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. నితీశ్‌తో భేటీ అనంతరం నవీన్ మాట్లాడుతూ, తాము చాలా కాలం నుంచి స్నేహితులమని, పొత్తుల గురించి చర్చ జరగలేదని చెప్పారు. నవీన్ తాజా ప్రకటనతో నితీశ్ యత్నాలకు గండి పడినట్లేనని భావించవచ్చు.
ఇదిలావుండగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లతో నవీన్ పట్నాయక్ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ నవీన్ ఈ వార్తలను తోసిపుచ్చారు.
నవీన్ పట్నాయక్ దాదాపు ఓ నెల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. నవీన్ 22 ఏళ్ళ నుంచి ఒడిశాను పరిపాలిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందువల్ల బీజేపీకి గట్టి సందేశాన్ని ఇవ్వడం కోసం నవీన్ ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు.
బీజేడీ 2008లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. కానీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎంపీల సంఖ్యాబలం అవసరమైనపుడు సహకరిస్తోంది. నితీశ్ కుమార్ మే 18న ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట
Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..
Updated Date - 2023-05-11T20:48:12+05:30 IST