Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!
ABN , First Publish Date - 2023-06-07T10:00:03+05:30 IST
అక్రమార్కులకు అన్నిటిలోనూ అవకాశాలు కనిపిస్తాయి. దురాశపరులు శవాల మీద పేలాలు ఏరుకుంటారని అంటారు.
భువనేశ్వర్ : అక్రమార్కులకు అన్నిటిలోనూ అవకాశాలు కనిపిస్తాయి. దురాశపరులు శవాల మీద పేలాలు ఏరుకుంటారని అంటారు. డబ్బు మీద పేరాశ ఉన్నవారికి అక్రమ సంపాదనకు అనర్హమైనది ఏదీ కనిపించదు. ఒడిశా రైలు ప్రమాదం అనంతరం ఇలాంటివారి చర్యలు ఈ విషయాలను రుజువు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో మరణించినవారిలో కొందరిని ఇంకా గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు ఇదే అదనుగా ఆ మృతదేహాల వద్దకు వెళ్లి, ఇది తమ బంధువుదేనని చెప్పి, ప్రభుత్వాన్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటివారి దుశ్చర్యలను గమనించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
మోసం ఎలా బయటపడిందంటే..
జూన్ రెండున సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనలో సుమారు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,100 మంది గాయపడ్డారు. అయితే మృతుల్లో కొందరిని ఇప్పటికీ అధికారులు గుర్తించలేకపోతున్నారు. కటక్ నివాసి గీతాంజలి దత్తా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, ఇతర సదుపాయాలను అక్రమంగా సొంతం చేసుకోవాలని భావించారు. ఈ ప్రమాదంలో మరణించినవారి ఫొటోలను బాలేశ్వర్‌లో ఉంచినట్లు తెలుసుకుని, అక్కడికి వెళ్లారు. పోలీసులను సంప్రదించారు. తన భర్త ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు స్పందించి, ఈ ఫొటోల్లో ఎవరు మీ భర్త? అని అడిగారు. ఆమె ఓ వ్యక్తి ఫొటోను చూపించి, ఆయనే తన భర్త అని చెప్పారు. కానీ ఆమె అందుకు తగిన విధంగా నటించలేకపోయారు. ఆమె ప్రవర్తనను అనుమానించిన పోలీసులు మరిన్ని వివరాలను అడిగారు. అక్కడితో ఆగకుండా కటక్ పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించారు. అప్పుడు అసలు విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఆమె భర్త బతికే ఉన్నట్లు తెలిసింది. వెంటనే గీతాంజలిని గట్టిగా నిలదీసి ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తోందని, ఆ సొమ్ము కోసం ఆశపడి ఇలా చేశానని ఆమె చెప్పారు. తన తప్పును అంగీకరించారు.
ఇవి కూడా చదవండి :
Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంపై సానుకూల నిర్ణయం
Wrestlers : రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్ర ప్రభుత్వం