Narendra Modi: దక్షిణాదిపై మోదీ ఫోకస్
ABN, First Publish Date - 2023-01-17T22:37:08+05:30
ముఖ్యంగా దక్షిణాదిపై ఫోకస్ చేయాలని మోదీ సూచించారు.
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలకు((2024 Lok Sabha Elections)) అందరూ సిద్ధం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు రానున్న 400 రోజులు కీలకమని న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో(BJP national executive meeting) చెప్పారు. ముఖ్యంగా దక్షిణాదిపై ఫోకస్ చేయాలని మోదీ సూచించారు. ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ సత్తా చాటాలని మోదీ యోచిస్తున్నారు.
కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరాణాన్ని తమకు మరింత అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాథులు యత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా మరోసారి విజయఢంకా మోగించేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
తమిళనాట ఐపీఎస్ అన్నామలై రూపంలో గట్టి నాయకుడు లభించడంతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా వీలైనన్ని ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది.
కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్ కూటమికి దీటుగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కేరళలో ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలని కమలనాథులు యోచిస్తున్నారు.
అదే సమయంలో ఇప్పటికే నలుగురు ఎంపీలున్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడంతో పాటు ఎక్కువ ఎంపీ సీట్లను గెలిచే టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్రను ప్రధాని మెచ్చుకున్నారు. తెలంగాణాలో గెలిచి తీరేలా ప్రజామద్దతు కూడగట్టేలా వ్యూహాలు రూపొందించి అమలు చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అటు బండి సంజయ్ కూడా తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసి తీరతామనే భరోసాతో ఉన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో బెంగాల్ తరహా హింసాత్మక పాలన కొనసాగుతుందని బండి ఆరోపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కొత్త దుకాణం తెరిచారని బండి సంజయ్ ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి ఇదే సరైన తరుణమని కమలనాథులు యోచిస్తున్నారు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడటం, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు.
ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ అధిక సంఖ్యలో ఎంపీ నియోజకవర్గాల్లో గెలవడం ద్వారా ముచ్చటగా మూడోసారి సొంతంగా అధికారంలోకి రావాలనేది మోదీ యోచన. ఎన్డీయే పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా బీజేపీకి సొంతంగా మెజార్టీ వచ్చేలా చూడాలనేది కమలనాథుల ప్లాన్. అందుకే ఒకవేళ ఉత్తరాదిన సీట్లు తగ్గినా దక్షిణాదిలో ఎక్కువ ఎంపీ సీట్లను గెలిచి బ్యాలన్స్ చేయాలని చూస్తున్నారు.
Updated Date - 2023-01-18T08:05:08+05:30 IST