Rahul Gandhi: ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడి
ABN , First Publish Date - 2023-03-06T02:35:25+05:30 IST
బ్రిటన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ క్రూరమైన దాడిని ఎదుర్కొంటోందని, దేశంలోని సంస్థలు అన్నింటిపైనా పూర్తిస్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు.

జర్నలిస్టులను బెదిరించి, దాడులు చేస్తున్నారు
బీబీసీ కేంద్రానికి వ్యతిరేకంగా రాయకపోతే కేసులన్నీ కనుమరుగవుతాయి: రాహుల్
లండన్, మార్చి5: బ్రిటన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ క్రూరమైన దాడిని ఎదుర్కొంటోందని, దేశంలోని సంస్థలు అన్నింటిపైనా పూర్తిస్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు. లండన్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంపద కేంద్రీకరణ, మహిళలపై హింసవంటి సమస్యలతో సతమతమవుతున్న దేశానికి తగిన ప్రత్యామ్నాయం కోసం ఏకతాటిపైకి రావడానికి ప్రతిపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ సర్వే నిర్వహించడాన్ని దేశవ్యాప్తంగా నినదించే గొంతుకల అణచివేతకు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశాన్ని నోరెత్తకుం డా చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తడమే తన భారత్ జోడో యాత్ర ఉద్దేశమని తెలిపారు. శనివారం ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ) నిర్వహించిన ఇండియా ఇన్‌సైట్స్ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. మన ప్రజాస్వామ్య నిర్మాణాలు క్రూరమైన దాడికి గురికావడం వల్లే తాను యాత్ర చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మీడియా, సంస్థాగత వ్యవస్థలు, న్యాయవ్యవస్థ, పార్లమెంట్..అన్నీ దాడికి గురవుతున్నాయని, సాధారణ మార్గాల ద్వారా ప్రజల గొంతుకను వినిపించడం చాలా కష్టంగా మారిందని ఆరోపించారు. ‘‘ఈ విషయాన్ని బీబీసీ ఇప్పుడు గుర్తించింది.
జర్నలిస్టులను బెదిరించడం, దాడులు చేయడం గత తొమ్మిదేళ్ల నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీబీసీరాయడం మానేస్తే అంతా సాధారణస్థితికి వస్తుంది. కేసులన్నీ కనుమరుగైపోతాయి’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలోని దళితులు, బలహీన వర్గాల ప్రజలు నోరెత్తకూడదని బీజేపీ కోరుకుంటోందన్నారు. ప్రజల దృష్టి ని మరల్చడం, దేశ సంపదను నలుగురు, ఐదుగురికి పంచడమే బీజేపీ విధానమన్నారు. మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు చైనాతో ఉన్న ముప్పు అర్థం కావ డం లేదని రాహుల్ అన్నారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన మరోసారి ఆక్రమణకు తెగబడవచ్చని చైనీయులకు ఆహ్వానం పలికినట్లు ఉందన్నారు. భారత విదేశాంగ విధానానికి తాను మద్దతిస్తానని, దానిపై తనకేమీ వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే సరిహద్దుల్లో చైనీయులు విద్వేషపూరితంగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో మరింత అప్రమత్తత అవసరమని రాహుల్ అన్నారు.
తుక్డే తుక్డే గ్యాంగ్ అర్థం చేసుకోవాలి: రిజిజు
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందంటూ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తిప్పికొట్టారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పునరుజ్జీవం దిశగా ప్రయాణం ప్రారంభించిందని తుక్డే తుక్డే గ్యాంగ్ అర్థం చేసుకోవాలన్నారు. ఈ ముఠా దేశానికి వ్యతిరేకంగా దాడిని ప్రారంభించడానికి ముందుగా దేశ వ్యతిరేక సంస్థల మద్దతు పొందుతుందని ఆరోపించారు.