Rahul Gandhi Disqualified: రాహుల్‌పై కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే స్పీకర్‌ నిర్ణయం

ABN , First Publish Date - 2023-03-25T04:35:38+05:30 IST

హత్య, అత్యాచారంలాంటి క్రిమినల్‌ నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు.. అవినీతి, కుంభకోణాల కేసుల్లో నిందితులు.. ఎంతోమంది చట్టసభల సభ్యులుగా ఉన్నారు!

Rahul Gandhi Disqualified: రాహుల్‌పై కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే స్పీకర్‌ నిర్ణయం

హత్య, అత్యాచారంలాంటి క్రిమినల్‌ నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు.. అవినీతి, కుంభకోణాల కేసుల్లో నిందితులు.. ఎంతోమంది చట్టసభల సభ్యులుగా ఉన్నారు! నేరం రుజువు కానంతవరకూ వారు నిందితులే అనే మినహాయింపుతో వారు చట్టసభలకు హాజరవుతుండగా.. పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్‌ గాంధీపై మాత్రం.. శిక్షపడ్డ 24 గంటల్లోపే అనర్హత వేటు పడింది! ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది!! రాహుల్‌కు శిక్ష పడింది హత్య, అత్యాచారం లాంటి క్రిమినల్‌ కేసుల్లోనో, అవినీతి, కుంభకోణాల కేసుల్లోనో కాదని.. రాజకీయ విమర్శలకే పరిమితమైన ఈ కేసులో తీర్పు మేరకు ఆయనపై వేటు వేయడం సరైన నిర్ణయం కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై లోక్‌సభలో అనర్హత వేటు పడింది. క్రిమినల్‌ పరువు నష్టం కేసు(Criminal defamation case)లో సూరత్‌ కోర్టు(Surat Court) ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. ఆయనను లోక్‌సభ నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ స్పీకర్‌ ఓం బిర్లా(Speaker Om Birla) నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకుసభ వాయిదా పడ్డ తర్వాత.. లోక్‌సభ సెక్రటేరియట్‌ నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. శిక్ష పడ్డ రోజు.. అంటే 2023, మార్చి 23 నుంచి రాహుల్‌ను లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హుడిగా నిర్ణయించినట్లు సెక్రటరీ జనరల్‌ ఉత్తమ్‌కుమార్‌ సింగ్‌ పేరుతో నోటిఫికేషన్‌ వెలువడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(1)(ఇ) నిబంధన ప్రకారం.. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 8 కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

రాహుల్‌గాంధీని పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పు (కన్విక్షన్‌) మీద, ఆయనకు పడ్డ శిక్ష మీద పై కోర్టు స్టే విధించకపోతే.. ఆయన మరో 8 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు పడదు. కాగా.. సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఉదయం సమావేశమై చర్చించింది. ఆ భేటీలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ఎప్పటిలాగానే సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. గంటపాటు వాయిదా పడింది. అనంతరం లోక్‌సభ సెక్రటేరియట్‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిపై రాహుల్‌.. ‘‘నేను దేశ వాణిని వినిపించడానికి పోరాడుతున్నాను. ఇందుకోసం ఏ మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’ అని ప్రకటించారు.

కలిసి ఉద్యమిద్దాం..

రాహుల్‌పై అనర్హత వేటు నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ అగ్రనేతలు వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంశంపై ఎలా వ్యవహరించాలో భేటీలో చర్చించారు. దేశవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ భేటీలో సోనియాగాంధీ, ప్రియాంక, ఖర్గే, చిదంబరం తదితర నేతలు పాల్గొన్నారు. కాగా.. ఈ అంశంపై పార్టీ చట్టపరంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి అభిషేక్‌ సింఘ్వి పార్టీ సభ్యులకు వివరించినట్టు జైరామ్‌ రమేశ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాహుల్‌పై అనర్హత వేటును ఖండిస్తూ విపక్ష నేతలు చేసిన ప్రకటనలను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. విపక్షాల ఐక్యతను ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జైరామ్‌ రమేశ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు పార్లమెంటులో ప్రతిరోజూ విపక్ష పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిక పార్లమెంటు బయట కూడా దాన్ని కొనసాగించాల్సి ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2023-03-25T04:35:57+05:30 IST