Ayodya: రామ్‌లల్లా విగ్రహాల తయారీ ముమ్మరం.. ఎంపిక చేయనున్న కమిటీ సభ్యులు
ABN , First Publish Date - 2023-12-08T10:13:15+05:30 IST
అయోధ్య రామ మందిరం(Ayodya Lord Ram Temple)లో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా(Ramlalla) విగ్రహ తయారీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు.

లఖ్ నవూ: అయోధ్య రామ మందిరం(Ayodya Lord Ram Temple)లో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా(Ramlalla) విగ్రహ తయారీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఏర్పాటు చేసిన బృందం బాల రూపంలో ఉన్న రాముని విగ్రహాన్ని ఎంపిక చేస్తుంది.
అయోధ్యలోని ప్రధాన దేవాలయం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న రామ్ లల్లాకు చెందిన 3 విగ్రహాలను ప్రస్తుతం అయోధ్య పట్టణంలోని ప్రముఖ శిల్పులు చెక్కుతున్నారు. వీటిల్లో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 15 మరియు డిసెంబర్ 20 మధ్య మూడు విగ్రహాలు సిద్ధమయ్యే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్ ల నుంచి తీసుకువచ్చిన రాళ్లతో రాముడి విగ్రహాలు చెక్కుతున్నారు. ప్రఖ్యాత శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ్ పాండే రాముడి విగ్రహాలకు తుదిరూపునిస్తున్నారు.
విగ్రహాన్ని ఎంపిక చేసే ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన మహంత్ కమల్ నయన్ దాస్ మాట్లాడుతూ.. “విగ్రహం తప్పనిసరిగా ఐదేళ్ల రామ్ లల్లా ప్రతిరూపంగా ఉండాలి. మూడింటిలో ఒక విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడం అంత సులభం కాదు. కచ్చితంగా రామ్ లల్లాని పోలి ఉండే విగ్రహాన్ని ఎంపిక చేయడమే మా మొదటి లక్ష్యం” అని అన్నారు.
ట్రస్ట్ ఎంపిక చేసిన విగ్రహం జనవరి 17న అయోధ్యలోని శోభా యాత్రలో ఊరేగిస్తారు. జనవరి 18 నుంచి అయిదు రోజులపాటు రామ్ లల్లా పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది. అదే నెల 22వ తేదీన గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.