Rishi Sunak: ఖలీస్తానీ తీవ్రవాదాన్ని ఎదుర్కునేందుకు భారత్‌తో కలిసి బ్రిటన్ పని చేస్తోంది.. ఆ ఒప్పందంపై ఆసక్తిగా ఉన్నాం

ABN , First Publish Date - 2023-09-08T22:21:33+05:30 IST

రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..

Rishi Sunak: ఖలీస్తానీ తీవ్రవాదాన్ని ఎదుర్కునేందుకు భారత్‌తో కలిసి బ్రిటన్ పని చేస్తోంది.. ఆ ఒప్పందంపై ఆసక్తిగా ఉన్నాం

రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఖలీస్తానీ తీవ్రవాదంతో పాటు భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం తదితర అంశాలపై మాట్లాడారు. రిషి సునాక్ మాట్లాడుతూ.. ఖలిస్తానీ తీవ్రవాదం అంశాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి బ్రిటన్‌ పనిచేస్తోందని.. తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్నా వాటిని బ్రిటన్ అంగీకరించదని.. హింసాత్మక చర్యలు సరైనవి కావని అన్నారు. ఇటీవల తమ బ్రిటన్‌ భద్రతా మంత్రి భారత్‌లో పర్యటించారని.. తాము కీలక సమాచారాన్ని పంచుకుంటూ, ఈ ముప్పుకు ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరించుకుంటున్నాయని తెలిపారు.


అనంతరం భారత్‌తో వాణిజ్య ఒప్పందం గురించి రిషి సునాక్ మాట్లాడుతూ.. తాను, ప్రధాని మోదీ కలిసి సమగ్రమైన & ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం ముగియడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. అయితే.. ఇలాంటి ఒప్పందాలు ఎల్లప్పుడూ సమయం తీసుకుంటాయని, ఎందుకంటే రెండు దేశాల కోసం పని చేయాల్సి ఉంటుందని వివరించారు. అలాగే.. ఇరు దేశాల పరిశోధకులు, సైంటిఫిక్ కమ్యూనిటీ మధ్య పెరుగుతున్న సహకారం చూసి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానన్నారు. బ్రిటన్, ఇండియా రెండూ టెక్నాలజీ సూపర్ పవర్స్ అని.. రెండు దేశాలు కలిసి పని చేస్తే సరికొత్త ఉద్యోగాలతో పాటు కొత్త వ్యాపారాలు సృష్టించవచ్చని అన్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించడంలోనూ సహాయపడొచ్చని చెప్పారు.

ఇదే సమయంలో.. భారత్ అంటే తనకెంతో ఇష్టమని, తన కుటుంబం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పడానికి తాను ఏమాత్రం సంకోచించనని రిషీ సునాక్ పేర్కొన్నారు. హిందువుగా తాను గర్విస్తున్నానన్న ఆయన.. అలాగే పెరిగానని, అలాగే ఉన్నానని చెప్పారు. తాను తరచూ ఆలయాలకు వెళ్తానన్న ఱిసీ.. ఇటీవలే రక్షాబంధన్‌ కూడా చేసుకున్నామన్నారు. యూకే ప్రధాని బాధ్యతల్లో తాను ఇండియాకు వచ్చానని.. జీ20 సదస్సును విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన దేశం జీ20 సదస్సు నిర్వహిస్తోందంటూ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ రెండు రోజుల పాటు సాగే చర్చల్లో భాగంగా మంచి నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-08T22:23:26+05:30 IST