Train Accident: రైలు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ABN, First Publish Date - 2023-10-12T11:55:05+05:30
బీహార్‌లోని బక్సర్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి ఢిల్లీ-కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో కనీసం నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
పాట్నా: బీహార్‌లోని బక్సర్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి ఢిల్లీ-కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో కనీసం నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీస్ ఫోర్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మరణించడంతోపాటు 70 మంది గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రైల్వే శాఖ గురువారం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి కూడా రూ.50,000 చొప్పున అందించనున్నట్లు తెలిపారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విజువల్స్‌లో కనిపిస్తున్న దాని ప్రకారం రెండు ఏసీ III కోచ్‌లతోపాటు మరో నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణీకులను రక్షించడానికి స్థానికులు ప్రయత్నించారు. పట్టాలు తప్పిన కోచ్‌ల నుంచి ప్రయాణికులు బయటకు రావడానికి సహాయం చేశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు అధికారులు, అంబులెన్స్‌లు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన రైలును పట్టాలపై నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను విపత్తు నిర్వహణ శాఖ, ఆరోగ్య శాఖ, బక్సర్, భోజ్‌పూర్ జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. రఘునాథ్‌పూర్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కార్యాలయం పేర్కొంది. బక్సర్‌లోని జిల్లా అధికారులతో, ఇతర ఏజెన్సీలతో తాము టచ్‌లో ఉన్నామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇక రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
హెల్ప్‌లైన్ నంబర్లు:
పాట్నా: 9771449971, ధన్‌పూర్: 8905697493, కమాండ్ కంట్రోల్: 7759070004, అరా: 8306182542, న్యూఢిల్లీ -01123341074, 9717631960 , ఆనంద్ విహార్ టెర్మినల్- 9717632791, కమర్షియల్ కంట్రోల్ ఢిల్లీ డివిజన్ - 9717633779
Updated Date - 2023-10-12T11:55:05+05:30 IST