Rs 2 thousand notes: రాష్ట్రంలో కానరాని రూ.2 వేల నోట్ల రద్దు ఎఫెక్ట్!
ABN , First Publish Date - 2023-05-24T07:38:13+05:30 IST
రిజర్వు బ్యాంకు(Reserve Bank) రద్దు చేసిన రూ.2 వేల నోట్ల మార్పిడి ప్రభావం రాష్ట్రంలో మంగళవారం పెద్దగా కనిపించలేదు. రెండు వే
- సాధారణంగానే బ్యాంకుల్లో రద్దీ
ప్యారీస్(చెన్నై): రిజర్వు బ్యాంకు(Reserve Bank) రద్దు చేసిన రూ.2 వేల నోట్ల మార్పిడి ప్రభావం రాష్ట్రంలో మంగళవారం పెద్దగా కనిపించలేదు. రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేస్తూ ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2016లో మనుగడలోకి వచ్చిన ఈ నోట్లను ఆర్‌బీఐ(RBI) గుర్తింపు పొందిన బ్యాంకుల్లో మంగళవారం నుంచి మార్చుకోవచ్చని, ఒక్కో వ్యక్తి రోజుకు రూ.20 వేలు మార్చుకొనే సౌకర్యాన్ని కల్పించింది. అయితే తొలిరోజు చెన్నై, మదురై, కోయంబత్తూర్ తదితర పెద్ద నగరాలు సహా జిల్లా కేంద్రాల్లో ఉన్న బ్యాంక్‌ల వద్ద రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం ఎలాంటి హడావుడి కనిపించలేదు. రోజువారీలాగే తమ శాఖలు కొనసాగుతున్నాయని, బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో క్యాష్ ఉన్న వారు తమ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చని, రద్దీ పెరిగితే టోకెన్ విధానం అమలు చేస్తామని పలు బ్యాంక్ మేనేజర్లు(Bank Managers) తెలిపారు. కాగా, రోజులాగే చిరిగిన కరెన్సీ, పాత కరెన్సీని మార్చుకొనేందుకు స్థానిక ప్యారీస్‌లోని ఆర్‌బీఐ వద్ద ఖాతాదారులు బారులు తీరారు. రూ.2 వేల నోట్లు మార్పిడికి ఖాతాదారులు పెద్దసంఖ్యలో తరలివస్తారని బ్యాంక్ సిబ్బంది ఎదురు చూశారు. అయితే పలు పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి ఫీజులు చెల్లించేందుకు తరలివెళ్లిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులే బ్యాంక్‌ల్లో కౌంటర్ల ముందు బారులుతీరి కనిపించారు.