Supreme Court : ఈ సారికి ఊరుకుంటున్నా..
ABN , First Publish Date - 2023-09-27T01:36:40+05:30 IST
న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్రప్రభుత్వం వద్ద పెండింగులో ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఆదేశించింది. వారం

మరోసారి ఇలా ఉండబోదు
జడ్జిల నియామకంలో జాప్యంపై
సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ కౌల్ కన్నెర్ర
పెండింగులో 70 కొలీజియం సిఫారసులు
గత నవంబరు నుంచి అపరిష్కృతంగానే
వీటిలో జడ్జిల నియామకాలు, బదిలీలు
మణిపూర్ చీఫ్ జస్టిస్ నియామకం కూడా..
వారం రోజుల్లో చెబుతానన్న అటార్నీ జనరల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్రప్రభుత్వం వద్ద పెండింగులో ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఆదేశించింది. వారం రోజుల్లో దీనిపై ప్రభుత్వ వివరణ తెలుసుకొని నివేదిస్తానని ఆయన ధర్మాసనానికి తెలిపారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ‘గత వారం వరకూ 80 సిఫార్సులు పెండింగులో ఉన్నాయి. పది సిఫార్సులను ఈ మధ్య ఆమోదించారు. దీంతో ప్రస్తుతం 70 పెండింగులో ఉన్నాయి. వీటిలో జడ్జీల బదిలీలకు సంబంధించినవి 26, రెండోసారి సిఫార్సు చేసినవి 7, కొలీజియంకు తిప్పిపంపకుండా అపరిష్కృతంగా ఉన్నవి 9 ఉన్నాయి. ఒక సున్నితమైన రాష్ట్రం (మణిపూర్) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం కూడా పెండింగులోనే ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. ఇవన్నీ గత ఏడాది నవంబరు నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపింది. ‘ఇక మీదట ఈ నియామకాలపై ప్రతి 10-12 రోజులకొకసారి సమీక్షిస్తా. నేను రిటైరయ్యే లోపు (డిసెంబరు 25) వీలైనంత పని పూర్తయ్యేలా చూస్తా. వారం రోజుల స్వల్ప వ్యవధే అడిగారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. కానీ, వచ్చేసారి విచారణలో ఇలా ఉండబోను’ అని జస్టిస్ కౌల్ అటార్నీ జనరల్‌కు తేల్చి చెప్పారు. జడ్జీ పదవులకు కొలీజియం సిఫార్సు చేసిన పలువురు ప్రతిభావంతులైన న్యాయవాదులు.. కేంద్రం చేస్తున్న జాప్యం వల్ల తమ అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.