Udayanidhi Stalin: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి
ABN, First Publish Date - 2023-09-04T02:09:46+05:30
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin)కుమారుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) పిలుపిచ్చారు.
అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం
మలేరియా, డెంగీ, కరోనాలాంటిదే
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
భగ్గుమన్న బీజేపీ, హిందూసంస్థలు
హిందూయిజంపై ‘ఇండియా’కు ద్వేషం
భారతీయ వారసత్వంపైనే దాడి: అమిత్‌షా
హిందూ వ్యతిరేకతే విపక్షాల వ్యూహం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శ
ఢిల్లీ పోలీసులకు లాయర్ జిందాల్ ఫిర్యాదు
చెన్నై-ఆంధ్రజ్యోతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin)కుమారుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) పిలుపిచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా లాంటిదని.. దోమలను, వైర్‌సను నిర్మూలించినట్లే దానినీ సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై బీజేపీ అగ్ర నేతలు మండిపడగా.. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం (Congress MP Karti Chidambaram) సమర్థించారు. శనివారం రాత్రి చెన్నైలోని కామరాజర్ అరంగంలో తమిళ అభ్యుదయ రచయితల సంఘం, ద్రవిడ కళగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘సనాతన ధర్మ నిర్మూలనా మహానాడు’లో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడారు. ‘కొన్నింటిని మనం పూర్తిగా నిర్మూలించాల్సిందే. దోమలు, డెంగీ, మలేరియా, కరోనాను మనం వ్యతిరేకించకూడదు. వాటిని సమూలంగా నిర్మూలించాలి. ఆ కోవలోనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కంటే నిర్మూలించడమే మన ప్రధాన కర్తవ్యం. సనాతనం అనే పదమే సంస్కృతం నుంచి వచ్చింది. అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. సనాతనం అంటే స్థిరమైనది లేదా మార్చడానికి వీలులేనిది అని అర్థం. అన్నింటిలోనూ మార్పు ఉంటుంది. ఏవీ స్థిరమైనవి కావు’ అని ఉదయనిధి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన ‘నెంజుక్కునీది’ పుస్తకంలో బాల్యంలో తనకు ఎదురైన సనాతన ధర్మం అనుభవాలను వివరించారని తెలిపారు.
హిందూయిజాన్ని ‘ఇండియా’ ద్వేషిస్తోంది
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. విపక్ష ‘ఇండియా’ కూటమి హిందూయిజాన్ని ద్వేషిస్తోందనడానికి ఆయన మాటలే నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. ఆదివారం రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘ఉదయనిధి వ్యాఖ్యలు భారతీయ వారసత్వంపైనే దాడి. ఇండియా కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు ఎత్తుగడల్లో ఇది భాగం. ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్, డీఎంకే అగ్ర నేతల కుమారులు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని మాట్లాడుతున్నారు. లష్కరే తోయిబా కంటే హిందూ సంస్థలు అతి ప్రమాదకరమైనవని రాహుల్‌గాంధీ 2010లో అన్నారు. అప్పటి హోం మంత్రి (సుశీల్‌కుమార్ షిండే) దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని చెప్పారు. మోదీ గెలిస్తే సనాతనం గెలిచినట్లేనని కాంగ్రెస్ అంటోంది. ఇవన్నీ చూస్తుంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయని స్పష్టమైపోతోంది’ అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో హిందూ వ్యతిరేకతే మీ వ్యూహమా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాలను ప్రశ్నించారు. దేశంలో 80 శాతం మంది సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నారని.. వీరందరినీ నిర్మూలించాలంటే కాంగ్రెస్ మౌనం పాటించడం నరమేధానికి మద్దతివ్వడమేనని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ అన్నారు.
కార్తి చిదంబరం మద్దతు
ఉదయనిధి వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తి చిదంబరం సమర్థించారు. కులం దేశానికి శాపమని వ్యాఖ్యానించారు. జాతి నిర్మూలనకు ఉదయనిధి పిలుపునిచ్చారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే మాత్రం అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని.. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం దానికి ఏ మాత్రం లేదని చెప్పారు.
ఉదయనిధిపై ఫిర్యాదు
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటూ ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన ఆయన.. అన్ని మతాలను గౌరవించాలని.. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపివ్వడం మతప్రాతిపదికన వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించడమేనని ఆరోపించారు.
బెదిరింపులకు భయపడను
బీజేపీ, హిందూ సంస్థల విమర్శలపై ఉదయనిధి స్పందించారు. కాషాయ బెదిరింపులకు భయపడబోనని, అణగారిన వర్గాల తరఫునే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. సనాతన ధర్మం అనేది కుల మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించే సిద్ధాంతమన్నారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడి తాను ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నించలేదని.. దీనిపై ఎదురయ్యే సవాళ్లను న్యాయస్థానాల్లోనూ ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
హిందూ సంస్థల ఆగ్రహం
ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడులోని పలు హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదా ఆయనపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ, హిందూమున్నాని తదితర సంస్థలు డిమాండ్ చేశాయి. తమిళనాడులో భారత రాజ్యాంగం అమలవుతోందా అని వీహెచ్‌పీ అగ్ర నేత అలోక్‌కుమార్ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారే నాశనమైపోతారని స్పష్టం చేశారు. కైస్తవం లేదా ఇస్లాం మతం రాకముందే సనాతన ధర్మం అనే పదం ఉందని, సనాతన ధర్మం అంటే శాశ్వతమైనదని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. క్రైస్తవ మిషనరీల ఆలోచనలనే ఉదయనిధి, స్టాలిన్ ప్రతిధ్వనింపజేస్తున్నారని మండిపడ్డారు.
Updated Date - 2023-09-04T03:48:33+05:30 IST