Two thousand rupee notes: ఆ పెద్ద నోట్లు మాకొద్దు బాబోయ్..
ABN , First Publish Date - 2023-05-21T09:52:48+05:30 IST
రాష్ట్రంలో రెండు వేల రూపాయల నోటు పట్టుకుని దుకాణాల వద్దకు వెళుతున్న ప్రజలకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ త
- రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారుల తిరస్కరణ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు వేల రూపాయల నోటు పట్టుకుని దుకాణాల వద్దకు వెళుతున్న ప్రజలకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత రెండు వేల రూపాయల నోట్ల చెలామణీ రద్దవుతుందని రిజర్వు బ్యాంక్ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే రాష్ట్రంలో మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగస్థులు కుటుంబీకులు తాము దాచుకున్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే యజమానులు రెండు వేల రూపాయల నోటును చూస్తేనే జడుసుకుంటున్నారు. ఆ నోటిచ్చేవారికి సరకులిచ్చి చిల్లర ఇస్తే దానిని పట్టుకుని తాము బ్యాంకుల వద్ద మునుపటిలా పడిగాపులు పడవలసి వస్తుందేమోనని భయపడుతున్నారు. వీటన్నింటికి తోడు రాష్ట్రంలోని రెండు వాణిజ్య సంఘాల సమాఖ్యలు దుకాణాల యజమానులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. దుకాణాలలో రెండువేల రూపాయల నోటిస్తే ఎట్టిపరిస్థితులలో తీసుకోవద్దని ఉత్తర్వు జారీ చేశారు. శనివారం ఉదయం నగరంలోని ప్రముఖ దుకాణాలలో, కిరాణా షాపులలో, చివరకు మద్యం దుకాణాలకు రెండు వేల రూపాయల నోటును పట్టుకుని వెళితే అయ్యబాబోయ్ ఆ నోటు మాకొద్దు... దానిని బ్యాంకులో ఇచ్చి మార్చుకోండి అంటూ సలహా ఇస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలోనూ కొనసాగుతోంది. కొన్నేళ్లుగా చెన్నై(Chennai)లో రెండు వేల రూపాయల నోట్ల చెలామణీలో లేవు. ఏటీఎంలలో బ్యాంకులలో ఆ నోట్ల చెలామణీ ఎప్పుడో ఆగిపోయింది. ఈ పరిస్థితులలో రిజర్వు బ్యాంక్ ప్రకటన పుణ్యమా అని తమ ఇళ్లలో భద్రపరచిన రెండు వేల నోట్లతో సరకులు కొనేందుకు దుకాణాలకు వెళ్ళిన నగరవాసులను షాపు యజమానులు తిప్పిపంపుతున్నారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్‌మార్కెట్లు, వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలలో రెండు వేల రూపాయల నోట్లను తీసుకునేందుకు యజమానులు అంగీకరించలేదు. దీంతో రెండువేల రూపాయల నోట్లున్నవారంతా నిరాశతో తిరుగుముఖం పట్టారు. ఈ విషయమై ఆవడిలోని అయ్యర్ భవన్ హోటల్ యజమాని అయ్యాదురై మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే భావంతో ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లను తీసుకున్నామని, అలా తీసుకున్న నోట్లు వేలల్లో ఉండటంతో వాటిని ఒకే సమయంలో బ్యాంకులలో ఇచ్చి మార్చుకునేందుకు తంటాలు పడ్డామని, గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డులు చూపించాలంటూ బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెట్టారన్నారు. ఆ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లను తీసుకునేందుకు భయపడుతున్నామని చెప్పారు. శనివారం తన హోటల్‌కు రెండు వేల రూపాయల నోటును తీసుకువచ్చినవారిని తిప్పిపంపామన్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య సంఘాలకు చెందిన నాయకులు కొందరు తమ వాట్సప్ గ్రూపులో సభ్యులుగా ఉన్న దుకాణాల యజమానులు, సూపర్‌మార్కెట్ యజమానులకు ఓ సందేశం పంపారు. ఒక వేళ రెండు వేల రూపాయల నోట్లు తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేసినా ఐటీ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందంటూ హెచ్చరించారు. ఆ సందేశం కారణంగా ప్రస్తుతం నగరంలోని ప్రముఖ దుకాణాల యజమానులంతా ఆ పెద్ద నోటును తీసుకోవడం లేదు. కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, వేలూరు, కాంచీపురం, తిరువళ్లూరు తదితర జిల్లాల్లో శుక్రవారం ఉదయమే ప్రజలు రెండు వేల రూపాయల నోట్లను దుకాణాలలో మార్చుకునేందుకు తీవ్ర ప్రయత్నించారు.
టాస్మాక్ దుకాణాల్లో...
రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ దుకాణాలలో కొన్నేళ్ల తర్వాత రెండు వేల రూపాయల నోట్లు దర్శనమిస్తున్నాయి. ఆ నోట్లను తీసుకునేందుకు సేల్స్‌మెన్ తటపటాయిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.1000 నోట్లను మందుబాబులు మద్యం దుకాణాల్లో సరకులు కొనుగోలు చేసి సులువుగా మార్చుకోగలిగారు. ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లను ఆ దుకాణాల్లో సులువుగా మార్చుకోవచ్చునని వెళ్ళిన మందుబాబులకు సేల్స్‌మెన్ షాక్ ఇచ్చారు. బ్యాంకులో మార్చుకో వాల్సిందిగా సలహాలిచ్చి తిప్పిపంపుతున్నారు. ఈ విషయమై నగరంలో ఓ టాస్మాక్ మద్యం దుకాణం సేల్స్‌మెన్ ఒకరు మాట్లాడుతూ... రెండు మూడేళ్లుగా తమ దుకాణాల్లో ఒకటి రెండు చొప్పున రెండు వేల రూపాయల నోట్లు ఉండేవని చెప్పారు. ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్ల చెలామణి రద్దు చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించగానే శనివారం ఉదయం నుండే ఆ నోట్లను పట్టుకుని మద్యం కొనేందుకు పలువురు దుకాణాల వద్ద బారులు తీరారని చెప్పారు. ఆ నోట్లను తీసుకుంటే సమస్యలు ఎదురవుతాయనే వాటిని తీసుకోవడానికి జంకుతున్నామని చెప్పారు.