ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: ప్రతిపక్షాలను కలిపే యత్నంలో ఖర్గే ఇలా... వివాదాస్పద వ్యాఖ్యలతో రాహుల్ అలా...

ABN, First Publish Date - 2023-03-27T17:54:52+05:30

ఈ దశలో రాహుల్... సావర్కర్‌పై తన వివాదాస్పద వ్యాఖ్యలతో తనకు మద్దతిస్తున్న పార్టీల నాయకుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు.

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) యత్నిస్తున్నారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను గాంధీనని, సావర్కర్‌ను(Savarkar) కాదని ఎవర్నీ క్షమాపణ అడిగే ప్రశ్నేలేదని రాహుల్ గాంధీ అనడంపై శివసేన ఉద్ధవ్ వర్గం (Uddhav led Shiv Sena) కినుక వహించింది. సావర్కర్‌ తమ ఆరాధ్య దైవమని ఆయన్ను అవమానిస్తే ఊరుకునేది లేదని ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే హెచ్చరించారు. సావర్కర్‌పై రాహుల్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ఇవ్వబోయే డిన్నర్ సమావేశానికి డుమ్మా కొట్టాలని శివసేన ఉద్ధవ్ వర్గం నిర్ణయించింది. తమ వర్గం నేతలెవరూ ఖర్గే డిన్నర్ సమావేశానికి వెళ్లరాదని నిర్ణయించింది. ఇదే విషయన్ని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) వెల్లడించారు. రాహుల్ అనవసరంగా సావర్కర్ పేరును వివాదంలోకి లాగుతున్నారని రౌత్ చెప్పారు. తమకు సావర్కర్, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి అని స్పష్టం చేశారు. రాహుల్ ప్రకటన తప్పని రౌత్ తేల్చి చెప్పారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ఖర్గే యత్నిస్తున్నారు. అందరితో మాట్లాడుతూ ఐక్యత కోసం యత్నిస్తున్నారు. ఈ దశలో రాహుల్... సావర్కర్‌పై తన వివాదాస్పద వ్యాఖ్యలతో తనకు మద్దతిస్తున్న పార్టీల నాయకుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు. తద్వారా ప్రతిపక్షాల ఐక్యతను రాహుల్ గాంధీయే దెబ్బతీస్తున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సూరత్ కోర్ట్ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

మరోవైపు సావర్కర్‌పై వ్యాఖ్యలకు గాను రాహుల్ క్షమాపణ చెప్పాలని సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar, Grandson of VD Savarkar) డిమాండ్ చేశారు. రాహుల్ తన రాజకీయాల కోసం దేశభక్తులను కించపరుస్తున్నారని రంజిత్ సావర్కర్ విమర్శించారు. సావర్కర్ క్షమాపణలు చెప్పినట్లుగా ఆధారాలుంటే చూపాలని ఆయన రాహుల్‌ను సవాల్ చేశారు.

మహారాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్లమెంట్‌లో శివాజీ విగ్రహం ఎదుట వారు ఆందోళనకు దిగారు.

2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకుగాను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. అయితే, ఆయనకు రూ.10 వేల బాండుతో బెయిల్‌ ఇచ్చి, పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజులపాటు శిక్షను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది. అప్పట్లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్‌ మోదీ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు.

కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఏప్రిల్‌ 13న ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ‘మోదీ’ అనే ఇంటిపేరు ఉన్నవారందరినీ, మోదీ ‘కమ్యూనిటీ’ని అవమానించే విధంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్‌ మోదీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 అక్టోబరులో రాహుల్‌గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్‌ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీని ఉద్దేశించి చేశారు కాబట్టి.. వేస్తే ప్రధానే దీనిపై కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని, పూర్ణేశ్‌ మోదీ కాదని రాహుల్‌ తరఫు న్యాయవాది వాదించారు. అలాగే.. మోదీ అనే ‘కమ్యూనిటీ’యే లేదు కాబట్టి అసలు ఈ కేసు చెల్లదని కోర్టుకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని బయటపెట్టడం తప్ప.. రాహుల్‌ వ్యాఖ్యల వెనుక వేరే ఎలాంటి దురుద్దేశాలూ లేవని వెల్లడించారు. కేసు విచారణ కిందటివారమే ముగియగా.. ఇరుపక్షాల తుది వాదనలూ విన్న కోర్ట్‌ ఆఫ్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌హెచ్‌ వర్మ.. తీర్పును వాయిదా వేశారు. ఆ తీర్పును గురువారం ప్రకటించారు.

‘‘రాహుల్‌ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, మేహుల్‌ చోక్సీ, అనిల్‌ అంబానీకి పరిమితం చేసుకుని ఉండాల్సింది. కానీ, ఆయన ఉద్దేశపూర్వకంగానే ‘మోదీ’ అనే ఇంటిపేరు కలిగి ఉన్న వ్యక్తులకు బాధకలిగించే వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్‌ పరువునష్టానికి పాల్పడ్డారు’’ అని తన తీర్పులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉంటుందనే విషయం.. దాని ద్వారా ఏమేరకు ప్రయోజనాలు పొందగలననే విషయం కూడా ఆయనకు తెలుసని తీర్పులో వ్యాఖ్యానించారు. 2018లో రాహుల్‌ చేసిన ‘చౌకీదార్‌ చోర్‌హై’ వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల గురించి.. అప్పట్లో రాహుల్‌ బేషరతు క్షమాపణలు చెప్పిన విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.

రాహుల్‌ వ్యాఖ్యల వల్ల.. ఫిర్యాదిదారుకు ఎలాంటి బాధ, నష్టం కలగలేదని, రాహుల్‌ గతంలో ఎలాంటి కేసులోనూ దోషి కాడని.. కాబట్టి తేలికపాటి శిక్ష విధించాలని రాహుల్‌ న్యాయవాది చేసిన వ్యాఖ్యలతో కూడా న్యాయమూర్తి ఏకీభవించలేదు. కాగా.. తీర్పు వెలువడే సమయంలో రాహుల్‌ గాంధీ కోర్టుహాల్‌లోనే ఉన్నారు.

నిజాలు మాట్లాడినందుకు రాహుల్‌ గాంధీకి శిక్ష పడిందని.. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీలు చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కోర్టు గుజరాతీ భాషలో ఇచ్చిన 170 పేజీల తీర్పును ఆంగ్లంలోకి అనువాదం చేయాల్సి ఉందని.. దీనిపై అప్పీలుకు వెళ్లే పనిలో ఉన్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఈ తీర్పుపై చట్టప్రకారమే ముందుకెళ్లి, ఊరట పొందుతామని చెప్పారు. రాహుల్‌ను దోషిగా పేర్కొన్న ఈ తీర్పును.. దుర్బలమైన, తప్పులతో కూడిన, చట్టపరంగా నిలవని తీర్పుగా ఆయన అభివర్ణించారు.

రాహుల్‌గాంధీ విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి అనైతికమైన చర్యలకైనా పాల్పడుతుందని దుయ్యబట్టారు. కాగా.. సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ప్రతిపక్షాలన్నింటితో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్టు సమాచారం. అనంతరం 11.30 గంటలకు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ దాకా మార్చ్‌ చేయనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించడానికి సమయం కోరినట్టు తెలిపింది. రాహుల్‌ తాను చేసే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన సిట్టింగ్‌ పార్లమెంటు సభ్యుడు. ఒక ఎంపీగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు తీవ్రమైన విషయం. ఎంపీల ప్రకటనలకు విస్తృత ప్రభావం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఆయన చేసిన నేరం మరింత తీవ్రమైనది. దీనికి తక్కువ శిక్ష విధిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో ఊహించని షాక్


Updated Date - 2023-03-27T19:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising