Karnataka : ముఖ్యమంత్రి పీఠం రొటేషన్ పద్ధతి ఎందుకు విఫలమవుతోంది?
ABN, First Publish Date - 2023-05-16T15:19:28+05:30
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.
న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న హోరాహోరీ పోరులో సిద్ధరామయ్య ముందు వరుసలో కనిపిస్తున్నారు. అయితే డీకే శివ కుమార్ ఆ పదవి తనకే లభించాలని పట్టుబడుతున్నారు. ఈ తరుణంలో మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాలని, మిగిలిన మూడేళ్లు ఆ పదవిని శివ కుమార్‌కు అప్పగించాలని ఓ ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. మొదటి రెండేళ్లలో శివ కుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కొన్ని కీలకమైన మంత్రి పదవులను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.
అయితే ముఖ్యమంత్రి పదవి అనేది రాష్ట్రంలో చాలా కీలకమైనది. ప్రభుత్వం తరపున ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి తీసుకోగలుగుతారు. అభివృద్ధి పథకాల్లో వాటాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పొందగలుగుతారు. తాను కేటాయించిన టెండర్లు తాను పదవీచ్యుతుడినైతే కొనసాగుతాయో, లేదో అనే భయం వెంటాడుతుంది. గట్టిగా కృషి చేస్తే, తన వారసులను కూడా రాజకీయాల్లో బలోపేతం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని శాఖలపైనా పట్టు ఉంటుంది. అందరూ ఆత్మీయంగా పలుకరిస్తూ, గౌరవిస్తూ ఉంటారు. వీటన్నిటినీ కొద్ది కాలంపాటు అనుభవించి, అనుభూతి చెందితే, ఇక ఆ పదవిని వదిలిపెట్టాలనే ఆలోచనను దూరంగా ఉంచుతారు. ఆ ఆలోచన రావడమే వారికి ఇష్టం ఉండదు.
దీనికి ఓ ఉదాహరణ ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ, బీఎస్‌పీ రొటేషనల్ బేసిస్‌లో ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని నిర్ణయించాయి. ముఖ్యమంత్రి పదవిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీఎస్‌పీ, బీజేపీ మధ్య ఇచ్చి, పుచ్చుకోవాలని నిర్ణయించాయి. మాయావతి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆరు నెలలు గడిచాయి. అనంతరం ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వవలసి ఉంది. కానీ 1997లో మాయావతి ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ససేమిరా అన్నారు. బీజేపీకి ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి బదులు, ఆ పార్టీకి మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ తీవ్రంగా స్పందించి, బీఎస్పీని చీల్చేసింది. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ సహా చిన్న పార్టీలను చీల్చేసి, మద్దతును కూడగట్టుకుంది. కల్యాణ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన ఆ ప్రభుత్వం పదవీ కాలాన్ని పూర్తి చేసింది.
ఇవి కూడా చదవండి :
Karnataka CM Race : పెదవి కదపని సిద్ధరామయ్య
Karnataka CM Tussle : కాసేపట్లో ఢిల్లీకి డీకే శివ కుమార్
Updated Date - 2023-05-16T15:19:28+05:30 IST