Yediyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి

ABN , First Publish Date - 2023-03-27T19:03:46+05:30 IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై బంజారా వర్గానికి చెందిన..

Yediyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) ఇంటిపై బంజారా వర్గానికి చెందిన కొందరు సోమవారంనాడు దాడి చేశారు. రాళ్ల వర్షం కురిపించారు. శివమొగ్గ జిల్లా షికారిపుర టౌన్‌లోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. షెడ్యూల్డ్ కులాలకు (SCs)కు అంతర్గత వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ యడియూరప్ప ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటిపైకి రాళ్లు విసరడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. దీంతో పలువురు మహిళలు, లమాని వర్గానికి చెందిన బంజారాలు గాయపడ్డారు. దీంతో పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు.

విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు ఉన్న 17 శాతం రిజర్వేషన్‌ను అంతర్గత వర్గీకరణకు కర్ణాటక మంత్రివర్గం గతవారంలో నిర్ణయించింది. ఇందువల్ల తాము నష్టపోతామని బంజారా వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ అంతర్గత వర్గీకరణను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే యడియూరప్ప నివాసం వద్ద ఆందోళనకు దిగారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రిజర్వేషన్ అంశం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-03-27T19:03:46+05:30 IST