Bodybuilder Shilpa Prakash : సంకల్పమే ఆమె బలం
ABN , First Publish Date - 2023-08-29T23:33:38+05:30 IST
పెళ్లి తరువాత కెరీర్, అభిరుచులను పక్కన పెట్టేస్తారు చాలామంది మహిళలు. భర్త... పిల్లలు... ఇల్లు... బాధ్యతల్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. కానీ శిల్పా ప్రకాష్..! పెళ్లయి... బిడ్డ పుట్టాక... సరికొత్తగా జీవితాన్ని

పెళ్లి తరువాత కెరీర్, అభిరుచులను పక్కన పెట్టేస్తారు చాలామంది మహిళలు. భర్త... పిల్లలు... ఇల్లు... బాధ్యతల్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. కానీ శిల్పా ప్రకాష్..! పెళ్లయి... బిడ్డ పుట్టాక... సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు అధిక బరువుతో సతమతమైన ఆమె... ఇప్పుడు బాడీబిల్డర్‌గా పతకాల వేట సాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో మెప్పించిన 31 ఏళ్ల ఈ కేరళ మహిళ... ఇకపై అంతర్జాతీయ స్థాయిలోనూ అదరగొట్టాలనే ఉత్సాహంతో శ్రమిస్తున్నారు.
‘‘అందరి అమ్మాయిల్లానే నేను కూడా పెళ్లి చేసుకోగానే నా అభిరుచులు, ఆశయాలన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా చెప్పాలంటే... అసలు నా గురించి నేను పట్టించుకోవడం కూడా మానేశాను. ఎంతసేపూ ఇంటి పని. లేకపోతే ఏదో కాలక్షేపం. వేరే ధ్యాసే ఉండేది కాదు. అలాంటి నేను ఇవాళ ఒక బాడీబిల్డర్‌ను అవుతానని ఎన్నడూ ఊహించనేలేదు. అసలు నా ఆలోనలు అటువైపే వెళ్లలేదు. కానీ ఒక పుస్తకం నా మనసు మార్చేసింది. కాదు కాదు... నా జీవితాన్నే మార్చేసింది. అదే బాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ కిరణ్ డెంబ్లాపై రాసిన పుస్తకం. అది చదివాక నా ఆలోచనా విధానమే మారిపోయింది. నాలో ఎనలేని స్ఫూర్తి రగిలించింది. ఇది ఐదేళ్ల కిందటి సంగతి. కేరళ చెర్తాల సమీపంలోని చెరువరనం మా గ్రామం. నాన్న ప్రకాష్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్ అయ్యారు. అమ్మ సింధు మా ఊళ్లో గత పదిహేనేళ్లుగా ఫిట్‌నెస్ సెంటర్ నడిపిస్తున్నారు.
అవసరం అనుకోలేదు...
అయితే ఏ రోజూ వ్యాయామాలు అవసరమని నేను అనుకోలేదు. మొదటి నుంచీ కాస్త బద్దకం ఎక్కువ నాకు. అందుకే అమ్మకు ఫిట్‌నెస్ సెంటర్ ఉన్నా... ఎప్పుడూ అటు వైపు వెళ్లలేదు. ఇక పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతల పేరుతో ఆ బద్దకం మరీ ఎక్కువైంది. ఇంట్లో పని మినహాయిస్తే... శారీరక శ్రమ తక్కువైంది. విశేషమేమంటే... మావారు మను కూడా ఫిట్‌నెస్ ట్రైనరే. మోడల్ కూడా. కానీ వర్కవుట్స్ చేయమని ఎవరూ నన్ను బలవంతపెట్టేవారు కాదు. ఎందుకంటే చిన్న పిల్లను కాదు కదా... నా గురించి, నా ఆరోగ్యం గురించి నేను తెలుసుకోలేక పోవడానికి! అదే వారి అభిప్రాయం కూడా.
తొంభైకి వెళ్లి...
ఒంటికి ఎలాంటి వ్యాయామం లేక ఒక దశలో నా బరువు పెరిగిపోయింది. మా అమ్మాయి పుట్టాక తొంభై కిలోల వరకు వెళ్లింది. అప్పుడు కూడా నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. దాన్ని ఒక సమస్యగా కూడా భావించలేదు. కానీ ఎప్పుడైతే కిరణ్ డెంబ్లా గురించి తెలుసుకున్నానో... అప్పటి నుంచి నాకు ఫిట్‌నె్‌సపై శ్రద్ధ కలిగింది. నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. తల్లి అయ్యాక ఆమె ఎలా తన కెరీర్‌ను విజయవంతంగా మలుచుకుందో చదివాక నాలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఆమె ప్రేరణతోనే 2018లో వర్కవుట్స్ మొదలుపెట్టాను. బాడీబిల్డింగ్ కోసం ప్రత్యేకంగా శ్రమించాను. దాంతో నా బరువు అరవై కేజీలకు తగ్గింది.
పోటీలకు దిగి...
ఎప్పుడైతే సరైన బరువుకు చేరానో... అప్పటి నుంచి బాడీబిల్డింగ్ పోటీలకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అమ్మానాన్నలే కాదు... అందుకు మా వారు కూడా పూర్తి మద్దతునిచ్చారు. నన్ను ప్రోత్సహించారు. గత ఏడాది డిసెంబర్... అలప్పుళ జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ పోలీలు నిర్వహించారు. అదే నేను పాల్గొన్న తొలి ఈవెంట్. ఆ పోటీల మహిళల విభాగం ఓపెన్ కేటగిరీలో టైటిల్ సాధించాను. ఇక అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. తొలి పోటీలోనే విజయం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
జాతీయ స్థాయిలో..
ఈ ఏడాది మార్చిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నిరుత్సాహపడలేదు. మే మాసం కొచ్చీలో నిర్వహించిన ‘జేజే క్లాసిక్ సౌంతిండియన్ బాడీబిల్డింగ్ చాంపియన్‌షి్‌ప’లో రజత పతకం సాధించాను. గత ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచిన నాకు.. ఈ విజయం అతిపెద్ద ఊరటనిచ్చింది. తరువాత బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ‘ఇండియన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కార్నివాల్’లో కాంస్య పతకం గెలుచుకున్నాను.
అదే నా లక్ష్యం..
ప్రస్తుతం ‘ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ అండ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్’ నిర్వహించే పోటీల కోసం శ్రమిస్తున్నాను. అందులో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం. తిరువనంతపురం ప్రాంతానికి చెందిన ట్రైనర్ ప్రదీష్ ఆధ్వర్యంలో సాధన చేస్తున్నాను. నేను దగ్గర లేనప్పుడు మా అమ్మాయి ఆడ్లే బాధ్యతలు మా ఇంట్లో వాళ్లు చూసుకొంటారు. కనుక నాకు తన గురించిన దిగులు లేదు. పూర్తి స్థాయిలో బాడీబిల్డింగ్ మీద దృష్టి పెట్టే అవకాశం కలిగింది. ఇంత మంచి కుటుంబం అండగా ఉండడం నిజంగా నా అదృష్టం. నా లక్ష్యం కోసం నాతోపాటు ఇంతమంది శ్రమిస్తున్నారు. సహకరిస్తున్నారు. ఈ శ్రమను వృథా కానివ్వను.’’