NRI: అమెరికాలో మనోళ్ల రేంజ్ ఇదా.. భారత సంతతి వారిపై అమెరికా చట్టసభ సభ్యుడి ప్రశంసల వర్షం..
ABN , First Publish Date - 2023-01-13T17:50:23+05:30 IST
అమెరికా అభివృద్ధిలో భారత సంతతి వారు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో కళ్లకు కట్టినట్టు వర్ణించారో అమెరికా చట్టసభ సభ్యుడు.
ఎన్నారై డెస్క్: అమెరికా అభివృద్ధిలో భారత సంతతి వారు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో కళ్లకు కట్టినట్టు వర్ణించారో అమెరికా చట్టసభ సభ్యుడు. అమెరికా జనాభాలో(Population) భారత మూలాలున్న వారు(Indian Americans) ఒక శాతమే అయినా మొత్తం పన్నుల్లో(Taxes) వారి వాటా ఏకంగా 6 శాతమని ప్రతినిధుల సభ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్(Rich McCormick) పేర్కొన్నారు.
స్వయానా వైద్యుడైన రిచ్ మెక్‌కార్మిక్.. జార్జియా(Georgia) రాష్ట్రంలోని ఆరవ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన ఘన విజయం సాధించారు. గురువారం సభలో మెక్‌కార్మిక్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న భారత సంతతి వారిపై(Indian Americans) ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘అమెరికా జనాభాలో భారతీయుల వాటా 6 శాతమే కానీ మొత్తం వసూలైన పన్నుల్లో వారి వాటా ఆరు శాతం. భారత సంతతి వారు చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. వారితో ఎటువంటి సమస్యలు రావు. భారతీయుల్లో సృజనాత్మకత, ఉత్పాదకత ఎక్కువ. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు. నా నియోజకవర్గంలో భారత సంతతి వారి వాటా ఎక్కువ. సుమారు లక్ష మందికిపైగా భారతీయులు స్వదేశం నుంచి నేరుగా ఇక్కడకు వలసొచ్చారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు భారత సంతతి వారే. అమెరికాలోని అత్యుత్తమ పౌరుల్లో వారూ ఒకరు. ఇక్కడ పన్నులు చెల్లిస్తూ, చట్టానికి బద్ధులై ఉండేవారిని దేశంలోకి ఆహ్వానించేందుకు వలసల విధానాలను మరింత సరళతరం చేయాలి. భారతీయులను ఆ దేవుడు చల్లగా చూడాలి. భారతీయ రాయబారిని కలిసేందుకు నేనెంతో ఉత్సుకతతో ఉన్నా’’ అంటూ మెక్‌కార్మిక్ మనోళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు.