TAMA: 'తామా' ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ABN, First Publish Date - 2023-08-31T11:32:12+05:30
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంగళవారం పని రోజు అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 270 మందికి పైగా తరలివచ్చారు.
జనోత్సాహంతో వైభవోపేతంగా జరిగిన 'తామా' భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవం
TAMA: భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంగళవారం పని రోజు అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 270 మందికి పైగా తరలివచ్చారు. పెద్దలు, పిల్లలు, సీనియర్లు, యువత దేశభక్తిని చాటుకున్నారు. విశ్రాంత మేజర్ జనరల్ డాక్టర్ ఆర్. శివ కుమార్, ప్రొఫెసర్ పి. కె రాజు, మేజర్ కె. గోవిందరాజ్, ప్రొఫెసర్ క్రిష్ణ మూర్తి వడ్లమూడి, ప్రభుత్వ ఉద్యోగిని భరణి, విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, జాన్స్ క్రీక్ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి దేవ్ రాపూరి, నేవీ ఉద్యోగిని కన్యా కుమారి విశిష్ఠ అతిధులుగా విచ్చేసి జెండా ఎగుర వేశారు. వారితో పాటు అందరూ జాతీయ గీతం ఆలపించారు. ఈ జెండా వందనం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
ఇతర సంస్థలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి అతిథులందరినీ సభకు పరిచయం చేశారు. శివ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ విశిష్ఠతను విశదీకరించి, సైన్యంలో పని చేసినప్పటి అనుభవాలను పంచుకున్నారు. ధైర్యం, స్థైర్యం తక్కువగా ఉన్నా సైన్యంలో చేరవచ్చనీ, యూనిఫామ్ అన్నీ నేర్పిస్తుందని గోవిందరాజ్ అన్నారు. పి. కె రాజు తన సుదీర్ఘ వృత్తి అనుభవాలను పంచుకుని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో తన అనుబంధాన్ని తెలిపారు. ఇంత మంది పిల్లలు, యువత హాజరు కావడం గొప్ప విషయమనీ, వారికి చరిత్ర చెప్పడం అవసరమని క్రిష్ణ మూర్తి గారు అన్నారు.
అలానే భరణి, దేవ్, కన్యా కుమారి స్వాతంత్య్ర దినోత్సవ వైభవాన్ని, త్యాగాలను విపులీకరించి, తామా నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాల, మనబడి, పండుగలు, యువత, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు బాగా చేస్తున్నారని మెచ్చుకున్నారు. బాబ్ ఎర్రమిల్లి యువత వీలైతే అమెరికా లేక ఏ దేశ సైన్యంలోనైనా కొన్ని రోజులు పని చెయ్యాలని చెప్పారు. ఇంత మంది వైవిధ్యమైన నిపుణులను ఒక్క చోటికి తీసుకు రాగలిగినందుకు తామా వారిని అభినందించారు. అతిథులందరినీ ఘనంగా సత్కరించారు. దేశ భక్తి గీతాలను పిల్లలే కాకుండా పెద్దవారు కూడా ఆలపించారు.
అలాగే తామా మనబడి ప్రతినిధులు తెలుగు భాష అవసరాన్ని చెప్పి, తరగతుల వివరాలను పంచుకున్నారు. ఆహుతులకు త్రాగు నీరు, చాక్లెట్లు, పునుగులు, పకోడీ, తేనీరు అందజేశారు. తామా వారు చాలా సంవత్సరాలుగా భారత జాతీయ పండుగలు విధిగా నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు. ఇంతమంది పెద్దవారిని కలవడం, వారితో మాట్లాడడం, ఫొటోలు తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తామా బోర్డు ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి ముగింపు ప్రసంగంలో ఈ వేడుకలను దిగ్విజయం చేసినందుకు అతిథులకు, వాలంటీర్లకు, తామా టీంకు, విచ్చేసిన వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.
Updated Date - 2023-08-31T11:32:12+05:30 IST