BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?
ABN , First Publish Date - 2023-08-21T17:03:31+05:30 IST
నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్.. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బట్టలు ఊడదీస్తా..! ఇవీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) చేసిన సంచలన వ్యాఖ్యలు..
నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్.. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బట్టలు ఊడదీస్తా..! ఇవీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) చేసిన సంచలన వ్యాఖ్యలు. అది కూడా తెలంగాణలో కాదు.. తిరుమలకు వెళ్లిన ఆయన అక్కడ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. సీన్ కట్ చేస్తే.. ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లినే ప్రకటించారు. అంటే.. తిట్టినా సరే టికెట్ ఇచ్చేశారన్న మాట. అయితే మైనంపల్లి కుమారుడికి మాత్రం మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. ఆ నియోజకవర్గం నుంచి మళ్లీ పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు.
మనసు మారింది!
గులాబీ బాస్ కేసీఆర్ (CMKCR) మల్కాజిగిరి (Malkajgiri) అభ్యర్థిగా తనపేరును ప్రకటించిన తర్వాత మైనంపల్లి మనసు మార్చుకున్నారు. జాబితా ప్రకటించే ముందు వరకూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హన్మంతరావు.. ప్రకటన తర్వాత కూల్ అయ్యారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోతానన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన ఆయన.. చివరికి తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై మల్కాజిగిరి నియోజకవర్గంలో సంబరాలు చేయాలని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు విజ్ఞప్తి చేశారు. టికెట్ ఇచ్చినప్పటికీ ఏం చేయాలో డైలామాలో ఉన్న అభిమానులు.. మైనంపల్లి నుంచి ప్రకటన రావడంతో ఆనందంలో మునిగిపోయారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటో..!
ఇంతవరకూ అంతా ఓకేగానీ.. మెదక్‌లో (Medak) తన కొడుకు పోటీపై నిర్ణయం రోహిత్‌కే (Rohit) వదిలేశానని మైనంపల్లి ప్రకటన చేయడం గమనార్హం. అంటే ఇండిపెండెంట్‌గా కానీ.. వేరే పార్టీ నుంచి పోటీచేయమని పరోక్షంగా హింట్ ఇస్తున్నారా..అనేది అభిమానులకు అర్థం కాని విషయం. మెదక్ నియోజకవర్గ అభ్యర్థిగా పద్మాదేవేందర్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవానికి హరీష్‌రావును విమర్శించిన తర్వాత సీన్ రివర్స్ అవుతుందని అందరూ భావించారు కానీ.. అయినా వాటిని లెక్కల్లోకి తీసుకోలేదు. చివరికి మైనంపల్లికే కేసీఆర్ ఓటేశారు. అయితే.. మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయను అంటే ఆయన ఇష్టం అని కేసీఆర్ ప్రత్యేకించి మరీ చెప్పారు. పైగా మున్ముందు అభ్యర్థుల మార్పులు, చేర్పులు కూడా ఉంటాయని కేసీఆర్ స్వయంగా చెప్పారు కూడా. మరోవైపు.. మైనంపల్లి వెలమ సామాజికవర్గం కావడంతో తన సామాజికవర్గం అభ్యర్థిని ఇప్పటికిప్పుడు మల్కాజ్‌గిరిలో తయారు చేయడం కష్టం అవుతుందని.. అందుకే మైనంపల్లికి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందనే ఆరోపణలు లేకపోలేదు.
ఇంతకీ హరీష్‌ను ఏమన్నారు..?
‘హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. హరీష్ నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను. అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తాను. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు. మెదక్ అసెంబ్లీ నుంచి నా కుమారుడు.. మల్కాజ్‌గిరిలోనే నేను పోటీ చేస్తాను. మెదక్‌లో నా కుమారుడిని కచ్చితంగా గెలిపించుకుంటాం. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నాను. నాకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది. అయితే నా కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాను’ అని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ పక్కనెట్టి.. మనసు మార్చుకుని బీఆర్ఎస్ తరఫునే పోచేస్తానని క్లియర్ కట్‌గా చెప్పేశారు.