PREETHI CASE: మెడికో ప్రీతి ఘటనలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..రాజకీయ లబ్ది కోసం పార్టీలు పాకులాడుతున్నాయా..!?
ABN, First Publish Date - 2023-03-11T08:55:30+05:30
వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. ప్రతీ ఇష్యూని అనుకూలంగా మలచుకునే రాజకీయ పార్టీలు..
మెడికో ప్రీతి ఘటన రాజకీయ రంగు పులుముకుందా?.. కేసులో ఎవరి పాపం ఎంతో పక్కకు పెట్టి.. రాజకీయ లబ్ది కోసం పార్టీలు పాకులాడుతున్నాయా?.. రేసులో ఎక్కడ మిస్సవ్వుతామోనని పోటీ పడుతున్నాయా..? ఇంతకీ.. మెడికో ప్రీతి ఘటన ఎందుకు రాజకీయ రంగు పులుముకుంది?.. రాజకీయ లబ్ది కోసం పాకులాడుతుందెవరు?...అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
ప్రతీ ఇష్యూని అనుకూలంగా మార్చకునే పార్టీలు
వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. ప్రతీ ఇష్యూని అనుకూలంగా మలచుకునే రాజకీయ పార్టీలు.. ప్రీతి ఘటనను కూడా అలాగే లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ ఒక అడుగు ముందుంటే.. మిగిలిన పార్టీలు తర్వాత దశలో ఉన్నాయి. మెడికో ప్రీతి గత నెల 26న మృతి చెందింది. అప్పటినుంచి ఆ వ్యవహారంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. ఒకడుగు ముందుకేసి.. లవ్ జిహాద్‌లో భాగంగానే ఘటన జరిగిందన్నారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే.. సైఫ్.. హోంమంత్రి మహమూద్ అలీ బంధువని.. నిందితుడ్ని ప్రభుత్వం కాపాడుతోందని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆరోపించాయి.
ఎంజీఎం, కేఎంసీ ముందు బీజేపీ శ్రేణుల నిరసన
వాస్తవానికి.. ప్రీతి ఘటన నిరసనల్లో బీజేపీ అందరికంటే ముందు వరుసలో ఉంది. ప్రీతి.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుంచి.. ఎంజీఎం, కేఎంసీ ముందు బీజేపీ శ్రేణులు, అనుబంధ సంఘాలు నిరసన తెలిపాయి. ప్రీతి చనిపోయిన రోజు ఆమె సొంతూరైన గిర్నితండాలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ నిరసనల్లో బీజేపీ జనగామ జిల్లా నాయకులు దశమంత్‌రెడ్డి, లేగా రామ్మోహన్‌రెడ్డి సహా.. రాష్ట్రస్థాయి నేత జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసన విరమించి.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదేరోజు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కేంద్రం నుంచి ప్రీతి కుటుంబానికి ఏమిచ్చారు?
ప్రీతి మృతి చెందిన వారం రోజుల తర్వాత బండి సంజయ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రీతి కేసు విషయంలో ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. అయితే.. అక్కడే స్థానికులు కొందరు బండి సంజయ్‌ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రీతి కుటుంబానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. దాంతో.. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు.. బండి సంజయ్, బీజేపీ నేతలను అక్కడినుంచి పంపించారు. అదేరోజు సాయంత్రం వరంగల్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించగా.. బండి సంజయ్ పాల్గొన్నారు. ఆ సందర్భంలోనూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రూ.10 లక్షల సాయం, ఒకరికి ఉద్యోగం
ఇదిలావుంటే.. ప్రీతి ఘటనలో కాంగ్రెస్ కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రీతి మృతి చెందిన రోజు జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి.. ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. బీఆర్ఎస్ నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ మొదటి నుంచి ప్రీతి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి పది లక్షల సాయం, ప్రీతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఎర్రబెల్లి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన మరో 20 లక్షల సాయం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే.. ఇటీవల మంత్రి కేటీఆర్.. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసు విచారణ త్వరగా ముగించి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రీతి కుటుంబ సభ్యుల ఎదుటే వరంగల్ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు.
మొత్తంగా... అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మెడికో ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డెక్కాయి. అయితే.. ప్రీతి ఘటన వరంగల్ జిల్లాలో రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు ప్రయత్నిస్తే.. అటు విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ డ్యామేజ్ కంట్రోల్‌కు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ప్రీతి ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Updated Date - 2023-03-11T08:55:30+05:30 IST