Jr NTR Puvvada Ajay Meeting: విగ్రహ ఆవిష్కరణకు పిలిచేందుకు కలిశారా.. లేక ఆ వంకతో..
ABN, First Publish Date - 2023-05-02T18:49:59+05:30
ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా తర్వాత ఈ నందమూరి హీరో అందుకోలేనంత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఆస్కార్’ గెలుచుకున్న నాటునాటు పాటకు..
టాలీవుడ్‌లో (Tollywood) ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr NTR) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా (RRR) తర్వాత ఈ నందమూరి హీరో అందుకోలేనంత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఆస్కార్’ గెలుచుకున్న నాటునాటు పాటకు దుమ్మురేపే స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్‌తో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భేటీ కావడం సినీరాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ మంత్రి మంగళవారం నాడు ఎన్టీఆర్‌ను స్వయంగా వెళ్లి కలిశారు. ఎన్టీఆర్ కూడా అంతే మర్యాదపూర్వకంగా పువ్వాడకు స్వాగతం పలికారు. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై దివంగత మహా నటుడు ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.
మే 28న ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్‌తో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని పువ్వాడ నిర్ణయించుకున్నారు. ఈ విగ్రహావిష్కరణకు విశిష్ట అతిథిగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం నాడు అతనిని కలిశారు. మంత్రి స్వయంగా వెళ్లి పిలవడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా విగ్రహావిష్కరణకు మే 28న ఖమ్మం పట్టణానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణావతారంలో తీర్చిదిద్దడం విశేషం. తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటేన్‌తో పాటు బోటు షికారు సౌకర్యంతో ఖమ్మం వాసులను ఆకర్షిస్తున్న లకారం ట్యాంక్‌బండ్‌కు ఎన్టీఆర్ విగ్రహం అదనపు ఆకర్షణగా నిలవనుంది.
అయితే.. రాజకీయ వర్గాలు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కూతుర్లు ఉండగా జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలెందుకనే ప్రశ్న తలెత్తడం కొసమెరుపు. ఒకవేళ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో విగ్రహావిష్కరణ చేయించాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కుటుంబం అంతటిని ఆహ్వానించాలి గానీ ఇలా ఒకరినే పిలవడం ఏంటనే చర్చ సోషల్ మీడియా సాక్షిగా జోరుగా సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాలకు వాడుకోవాలనే కాంక్షతోనే బీఆర్‌ఎస్ పువ్వాడను అస్త్రంగా ప్రయోగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూత్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలనే మాస్టర్ ప్లాన్‌తోనే ఈ విగ్రహ ఆవిష్కరణకు జూనియర్‌ను మాత్రమే పిలిచి ఉండొచ్చనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి పోకతో బీఆర్‌ఎస్ కొంత బలహీనపడిందని, అందుకే రాజకీయంగా కలిసొచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని బీఆర్‌ఎస్ ఫిక్స్ అయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్‌ను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో.. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా హైదరాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో చర్చలు జరిపిన పరిణామం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు.. తాజాగా బీఆర్‌ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి చర్చలు జరపడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై వార్తలు గుప్పుమంటున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తన తాతయ్య అంటే (సీనియర్ ఎన్టీఆర్) అమితమైన అభిమానమని, తాత అడుగుజాడల్లో నడిచి నటనను పుణికిపుచ్చుకున్న తమ హీరోను విగ్రహావిష్కరణకు పిలిస్తే ఇందులో వివాదం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు హాజరయ్యారని.. విశిష్ట అతిథిగా రజనీకాంత్ హాజరయ్యారని గుర్తుచేస్తున్నారు.
విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ను కాకుండా రజనీకాంత్‌ను ఎందుకు ఆహ్వానించారని అడగటంలో ఎంత అర్థం లేదో, జూనియర్ ఎన్టీఆర్‌తో పువ్వాడ భేటీని చర్చనీయాంశం చేయడంలో కూడా అంతే అర్థం లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా రంగంలో విశేషంగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ను తన తాతయ్య విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి పిలవడాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హితబోధ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారితీసిందని చెప్పడంలో సందేహం లేదు.
Updated Date - 2023-05-02T18:53:17+05:30 IST