West Godavari: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్..ఏకగ్రీవం చేయాలని భావించిన వైసీపీ నేతలకు షాకిచ్చిన టీడీపీ
ABN, First Publish Date - 2023-03-07T11:33:40+05:30
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కాక కొనసాగుతోంది. దానిలో భాగంగా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ...
ఆ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం వైసీపీకి షాకిచ్చిందా?.. రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించి ఆ పార్టీ పెద్దలు భంగపడ్డారా?.. అధికార పార్టీ ప్రలోభాలను ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు పట్టించుకోలేదా?.. ఆ జిల్లా తాజా పరిణామాలు అధినేతకూ ఆగ్రహం తెప్పించాయా?.. అదే సమయంలో.. అక్కడికి వెళ్లిన జగన్.. హెలీప్యాడ్ దగ్గరే పార్టీ నేతలకు క్లాస్ పీకారా?.. ఇంతకీ.. ఏంటా జిల్లా?.. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అసలేం జరిగింది?..మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
నలుగురు టీడీపీ మద్దతుదారులు నామినేషన్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కాక కొనసాగుతోంది. దానిలో భాగంగా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న.. ఆ రెండు స్థానాలపై వైసీపీ కన్నేసింది. ఎలాగైనా ఏకగ్రీవం చేయాలని భావించింది. అందుకు తగ్గట్లే.. వైసీపీకి స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు కూడా బాగానే ఉంది. దాదాపు 1100 మంది ఓటర్లు ఉండగా, వారిలో దాదాపు 700 వరకు వైసీపీ చెందిన వారే. దాంతో.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను నుంచి ఎలాంటి పోటీ ఉండదని వైసీపీ పెద్దలు అంచనా వేసారు. అక్కడే వారికి ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల సమయంలో వైసీపీ అభ్యర్థులతోపాటు టీడీపీ మద్దతుదారులు నలుగురు నామినేషన్లు వేసారు. అది వైసీపీ పెద్దలకు రుచించలేదు. అధికార దర్పాన్ని ప్రదర్శించి టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేసారు. అయితే.. ఎన్ని రకాల ప్రలోభాలకు గురిచేసినా టీడీపీ అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. పోటీలో ఉండడం ఖాయమని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇద్దరు వైసీపీ, నలుగురు టీడీపీ మద్దతుదారుల పోటీ
ఇక.. నామినేషన్ల ఉపసంహరణ రోజు కూడా టీడీపీ అభ్యర్థులను దారికి తెచ్చుకునేందుకు వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థులు లొంగకపోవడం వైసీపీ నేతలకు షాకిచ్చినట్లు అయింది. చివరికి.. నామినేషన్ల విత్‌డ్రా రోజున.. రాత్రి వేళ.. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఇద్దరు వైసీపీ అభ్యర్థులతోపాటు టీడీపీ మద్దతుదారులు నలుగురు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. అది కాస్తా.. అధికార పార్టీ పెద్దలకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. దాంతో.. ఆయా పరిణామాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు స్థానాలు ఏకగ్రీవం కాకపోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. మీరంతా ఏం చేస్తున్నారంటూ.. పార్టీ నేతలకు గట్టిగానే క్లాస్ పీకినట్లు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.
ఏకగ్రీవం చేయలేకపోవడం ఏంటని ప్రశ్నించిన జగన్
ఇదిలావుంటే.. నాలుగు రోజుల క్రితం.. సీఎం జగన్.. నిడదవోలు ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వెళ్లారు. హెలికాఫ్టర్‌లో నిడదవోలు వెళ్లిన ఆయన.. హెలిప్యాడ్ దగ్గరే పార్టీ నాయకులతో 20నిమిషాలపాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే.. ఎమ్మెల్సీ ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పశ్చిమలోనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థానాన్ని అక్కడి నేతలు ఎలా ఏకగ్రీవం చేశారని జగన్ క్లాస్ పీకారు. అధికారంలో ఉన్నాం.. స్థానిక సంస్థల ప్రతినిధుల ఓటు బ్యాంకు గట్టిగా ఉంది.. అయినా.. ఏకగ్రీవం చేయలేకపోవడం ఏంటని ప్రశ్నించినట్లు సొంత పార్టీలోనే టాక్ నడుస్తోంది.
వైసీపీ నేతల మధ్య విభేదాలపై తీవ్ర ఆగ్రహం
మరోవైపు.. కొందరు నేతలు.. వారు చేసిన ప్రయత్నాలను.. జగన్‌కు వివరించగా.. ఆయన మాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. అదంతా ఒక ఎత్తయితే.. జిల్లాలోని ఆధిపత్య పోరు మరో ఎత్తు అని చెప్పొచ్చు. పాలకొల్లు నియోజకవర్గంలోని ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పరిస్థితులను కొందరు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో.. వారిపైనా ఆయన ఒకింత సీరియస్ అయ్యారు. నేతల మధ్య విభేదాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా ఉంటానని చెప్పినా.. అసంతృప్తి ఎందుకు అని ప్రశ్నించినట్లు టాక్ నడుస్తోంది. తాను చూసుకుంటా.. అన్నాను కదా.. అలాంటుప్పుడు విభేదాలు ఎందుకు అని మండిపడినట్లు తెలుస్తోంది. దాంతో.. పాలకొల్లు నియోజకవర్గంలోని ఆ ఇద్దరు నాయకులు మౌనం దాల్చక తప్పలేదు.
మొత్తంగా... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేషన్లకు సంబంధించి అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏకగ్రీవం చేయాలని భావించిన వైసీపీ నేతలకు.. టీడీపీ షాకిచ్చింది. టీడీపీ మద్దతుదారులు రంగంలోకి దిగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటు.. సీఎం జగన్ కూడా.. ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.
Updated Date - 2023-03-07T11:33:40+05:30 IST