KTR on Kavitha ED Summons: కవితకు ఈడీ సమన్లపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..
ABN, First Publish Date - 2023-03-09T12:53:19+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు పంపడంపై..
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు పంపడంపై తెలంగాణ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ (Telangana Minister KTR) స్పందించారు. తమ మంత్రులపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశారని.. బీజేపీ దర్యాప్తు సంస్థలను ఇలా ఉసిగొల్పుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన కేటీఆర్ (KTR Pressmeet) మాట్లాడుతూ.. కవితకు పంపింది ఈడీ సమన్లు (Kavitha ED Summons) కాదని మోదీ సమన్లని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏదో జరుగుతోందని భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నీతిలేని పాలకుల అవినీతి ప్రభుత్వంగా కేంద్రం మారిందని, మోదీ చేతుల్లో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అదానీ మోదీ బినామీ అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడని మంత్రి వ్యాఖ్యానించారు. అదానీ పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా చర్యలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా 6 పోర్టులను అదానీకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఉలకడు.. పలకడని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని, ఈడీ, సీబీఐ విపక్షాలపైనే 90 శాతం దాడులు చేశాయని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..
అదానీ.. మోదీ బినామీ అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు: కేటీఆర్
ముంద్రా పోర్ట్‌లో రూ.21వేల కోట్ల హెరాయిన్ దొరికితే ఏం చేశారు?
120 షెల్ కంపెనీల ద్వారా రూ.6వేల కోట్ల ఫ్రాడ్ చేసినట్లు సుజనాచౌదరిపై 2019 జూన్ 20న ఈడీ ట్వీట్ చేసింది.. ఆ కేసులు ఏమయ్యాయి?
నిబంధనలకు విరుద్ధంగా 6 పోర్టులను అదానీకి ఇచ్చారు: కేటీఆర్
అదానీకి 6 పోర్టులు ఇవ్వడాన్ని నీతి ఆయోగ్ తప్పుబట్టింది: కేటీఆర్
అదానీ కంపెనీకి మార్కెటింగ్ చేయడమే ప్రధాని పనా?: కేటీఆర్
ఒక ఇంజన్ అదానీ.. మరో ఇంజన్ ప్రధాని.. అదే డబుల్ ఇంజన్ సర్కార్
గౌతం అదానీపై దర్యాప్తు చేసే దమ్ము ధైర్యం ఉందా?: కేటీఆర్
ప్రధాని మోదీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు: మంత్రి కేటీఆర్
దేశంలో విపక్షాలను చీల్చే కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా?
లొంగనివారి మీదకు ఈడీని ఉసిగొల్పడం నిజం కాదా?: కేటీఆర్
తెలంగాణలో ఓ వ్యక్తికి రూ.18వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా?
బెంగాల్‌లో సువెందు అధికారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి?
హిమంత విశ్వశర్మపై వచ్చిన ఆరోపణలు ఏమయ్యాయి?: కేటీఆర్
విపక్షాల మీదనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి?: కేటీఆర్
9 ఏళ్లలో 9 ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది
బీజేపీలో చేరనంత వరకే కేసులు, అరెస్టులు..
బీజేపీలో చేరాక కేసులూ లేవు.. అరెస్టులూ లేవు: కేటీఆర్
ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికి ఆరేస్తానని మోదీ అంటున్నారు: కేటీఆర్
మేఘాలయ సీఎం సంగ్మాపై అవినీతి ఆరోపణలు చేశారు: కేటీఆర్
ఇప్పుడు ఆయన ప్రమాణస్వీకారానికి వెళ్లడానికి సిగ్గులేదా?: కేటీఆర్
కొందరికి మేలు చేయడానికి లిక్కర్ పాలసీ రూపొందించారని ఆరోపిస్తున్నారు
మీరు అదానీ కోసం పాలసీలు రూపొందించలేదా? అది స్కామ్ కాదా?
బీఎల్ సంతోష్ విచారణకు రాకుండా దాక్కున్నారు
మేం అలా కాదు.. విచారణ ఎదుర్కొంటాం: కేటీఆర్
న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది: మంత్రి కేటీఆర్
ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలంటూ బుధవారం నోటీసులు ఇచ్చింది. చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహిస్తున్నానని, ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల తాను రాలేనని కవిత సమాధానం ఇచ్చారు.
అయితే ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఈడీ వెంటనే తాఖీదులు పంపింది. తనకు మరింత సమయం కావాలని కవిత కోరుతున్నారని, అయితే ఈడీ స్పందించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తొలుత మరింత గడువు కావాలని కోరినప్పటికీ బుధవారం అర్ధరాత్రి ఈ నెల 11నే విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
Updated Date - 2023-03-09T13:42:44+05:30 IST