Food Items Eating Time: తినే సమయమే చాలా ముఖ్యం.. అరటిపండ్ల నుంచి నాన్‌వెజ్ వరకు.. దేన్ని ఏ టైమ్‌లో తినకూడదో తెలుసా..?
ABN , First Publish Date - 2023-03-28T09:59:20+05:30 IST
సాధారణంగా ఏ ఆహారపదార్థాలు ఏ సమయంలో తీసుకుంటే మంచిదనే విషయమే తెలుసుకుంటాం. కానీ ఏ సమయంలో ఏవి తినకూడదో తెలుసుకుంటే..
మనం రోజూ తినే ఆహారమే మనకు బలాన్ని ఇస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం తప్పనిసరిగా తీసుకునేవారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ఆహారాలు తీసుకునే సమయం చాలా ముఖ్యం. మనం ఏం తింటున్నా ఏ సమయంలో తింటున్నామనే దానిమీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏ ఆహారపదార్థాలు ఏ సమయంలో తీసుకుంటే మంచిదనే విషయమే తెలుసుకుంటాం. కానీ ఏ సమయంలో ఏవి తినకూడదో తెలుసుకుంటే.. పొరపాటున కూడా ఆరోగ్యసమస్యలు దరిచేరవు. మనం రోజూ తినే ఈ పదార్థాలు మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తున్నాయి.
అరటిపండు(Banana)
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. ఇవి రోగనిరోధక శక్తిని(Immunity power) పెంచుతాయి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. పైగా అందరికీ చవకగా దొరికే పండు ఇది. అందుకే చాలామంది అపటిపండు అన్నివేళలా తినడానికి ఇష్టపడతారు. కొందరు ఆకలేస్తుంటే భోజనానికి బదులు అరటిపండుతో కడుపునింపేసుకుంటారు. అంత శక్తివంతమైనది ఇది. రోజూ వర్కౌట్స్ చేసేవారు అరటిపండు తప్పనిసరిగా తింటారు. కానీ అరటిపండు రాత్రి భోజనానికి ముందు లేదా భోజనం తరువాత తినకూడదు. రాత్రి భోజనం తరువాత అరటిపండు తింటే అజీర్ణం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే ఇది శ్లేష్మం ఉత్పత్తి కావడానికి కారణం అవుతుంది.
యాపిల్స్(Apples)
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండచ్చనేది డాక్టర్లతో సహా అందరూ చెప్పేమాట. యాపిల్ లో ఉండే పెక్టిన్(Pectin) రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్(Control cholesterol levels) చేయడంలో సహాయపడుతుంది. కానీ ఈ పెక్టిన్ రాత్రిసమయాల్లో జీర్ణమవడం కష్టం. దానికి బదులుగా అది కడుపులో పులిసిపోయి ఆమ్లగుణం పొందుతుంది. ఈ కారణంగా కడుపులో యాసిడ్లు ఎక్కువ ఉత్పత్తయ్యి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే రాత్రిళ్ళు యాపిల్స్ కు దూరం ఉండటం మంచిది.
అన్నం(Rice)
భారతీయుల దృష్టిలో భోజనం అంటే అన్నం. తృప్తిగా భోజనం చేయడమంటే మూడు నుండి నాలుగు రకాల కూరలతో పుష్టిగా తినడం. అన్నంలో ఉండే కార్భోహైడ్రేట్స్(Carbohydrates) ఆరోగ్యానికి మంచివే.. రోజు మొత్తం పనులు చేయడానికి తగిన శక్తిని ఇస్తాయవి. కానీ రాత్రి పూట అన్నం తినడం వల్ల కడుపు నిండిన తృప్తి, శరీరంలో కార్భోహైడ్రేట్స్ పెరగడం జరుగుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనివల్ల చాలామంది బరువు పెరుగుతారని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో అన్నం తినకుండా మధ్యాహ్నం మాత్రమే అన్నం తినడం మంచిది.
మాంసాహారం..(Non-veg)
సాధారణ కూరగాయలు, ఆకుకూరలు జీర్ణం కావడానికి పట్టే సమయం కంటే రెండు రెట్ల సమయం పడుతుంది మాంసాహారం జీర్ణమవడానికి. పగటివేళలో మాంసాహారం తింటే రోజులో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి పర్లేదు. కానీ రాత్రి సమయాల్లో మాంసాహారం తింటే అది జీర్ణం కావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పైపెచ్చు మాంసాహారం వల్ల చాలా ఎక్కువ కేలరీలు శరీరంలో చేరతాయి. రాత్రిళ్ళు తినడం అలవాటు అయితే అధికబరువు సమస్య తొందరగా అటాక్ అవుతుంది.
డ్రైఫ్రూట్స్..
డ్రైఫ్రూట్స్ చాలా శక్తివంతమైన వనరులు కలిగి ఉంటాయి. వీటిలో కేలరీలతో పాటు చక్కెర శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు బాదం, పిస్తా, వాల్ నట్, జీడిపప్పు .. వీటిలో ఏదో ఒకటి తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఎక్కువసేపు చురుగ్గా ఉండచ్చు. అయితే అందులో ఉండే కేలరీలు, కొవ్వు పదార్థాలు జీర్ణం అవడానికి రాత్రిళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఏ నట్స్ అయినా సరే 5నుండి 6 తీసుకోవచ్చు. అంతకు మించి తింటేమాత్రం సమస్య వస్తుంది.
డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidant) ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని(control Heart Problems) తగ్గిస్తుంది. బద్దకంగా ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్ తింటే చురుకుదనం వస్తుంది, డార్క్ చాక్లెట్ వల్ల వృద్దాప్యం కూడా తొందరగా దరిచేరదని చెబుతారు. కానీ డార్క్ చాక్లెట్ రాత్రి సమయంలో తినడం అస్సలు మంచిది కాదు. ఇందులో కొవ్వు పదార్థాల కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణమవడానికి ఇబ్బంది అవుతుంది. సాధారణ సమయాల్లో కొద్దిగా తింటే మంచిదే కానీ, ఇది తినడానికి రాత్రి మాత్రం కరెక్ట్ సమయం కాదు.
Read also: PCOS: మహిళల్లో పిసిఓయస్ కు అసలు కారణాలు ఇవే.. చేతులారా ఇంత సమస్య తెచ్చిపెట్టుకుంటున్నారెందుకు?