Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!
ABN , First Publish Date - 2023-11-28T09:44:07+05:30 IST
Indigo launches AI chatbot 6Eskai: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) కస్టమర్లకు తన సేవలను మరింత సులువుగా, శరవేగంగా అందించేందుకు తాజాగా సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ చాట్‌బాట్ (AI chatbot) సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) కస్టమర్లకు తన సేవలను మరింత సులువుగా, శరవేగంగా అందించేందుకు తాజాగా సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ చాట్‌బాట్ (AI chatbot) సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. '6 ఎస్కై' (6Eskai) పేరిట తీసుకువచ్చిన ఈ చాట్‌బాట్ విమాన టికెట్ల బుకింగ్‌తో పాటు కస్టమర్లు అడిగే ప్రశ్నలకు ఏకంగా 10 భాషల్లో సమాధనం ఇవ్వగలదు. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో సమాధానాలు ఇవ్వడం ఈ చాట్‌బాట్ ప్రత్యేకత. దేశంలోని మరేతర ఎయిర్‌లైన్లు ఇప్పటివరకు ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇండిగోనే మొదటిసారి ఈ సరికొత్త సేవలను కస్టమర్లకు అందించనుంది. ఈ సర్వీస్ తమ సంస్థకు మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా ఇండిగో పేర్కొంది.
NRIs: భారత పర్యాటకులకు తీపి కబురు.. వీసా ఫ్రీ ఎంట్రీకి మరో దేశం గ్రీన్ సిగ్నల్..!
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తో కలిసి ఇండిగో డిజిటల్ బృందం ఈ కొత్త ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించడం విశేషం. అలాగే ఇందులో 'జీపీటీ-4' (Generative Pretrained Transformer) టెక్నాలజీని ఉపయోగించారు. ఈ చాట్‌బాట్ వల్ల కస్టమర్ సర్వీస్ ఏజెంట్లపై 75 శాతం వరకు పనిభారం తగ్గుతుందని ఈ సందర్భంగా ఇండిగో వెల్లడించింది. ఇక కస్టమర్లు తరచూ అడిగే అనేక సందేహాలను ఈ చాట్‌బాట్ చాలా ఈజీగా నివృత్తి చేయగలదని సంస్థకు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి కారణం ఇది 1.7 ట్రిలియన్ పారామితులను కలిగి ఉండడమేనని అన్నారు. విమాన టికెట్ బుకింగ్, వెబ్‌చెక్-ఇన్, సీట్ సెలక్షన్, ఇటిర్నరీ డౌన్‌లోడ్, జర్నీ లేదా ట్రిప్ ప్లానింగ్ తదితర సర్వీసులను ఈ ఏఐ చాట్‌బాట్ అందిస్తుందని ఇండిగో యాజమాన్యం స్పష్టం చేసింది. తద్వారా ప్రయాణికులు చాలా సులువుగా, వేగంగా సేవలను పొందుతారని పేర్కొంది. అంతేగాక డిస్కౌంట్ కూపన్ల వినియోగంలోనూ ఏఐ చాట్‌బాట్ సహాయపడుతుందట.
ఇది ఎలా పని చేస్తుందంటే..
ఈ ఏఐ చాట్‌బాట్ టెక్ట్స్ మాత్రమే కాకుండా స్పీచ్ ఆప్షన్ ద్వారా మనం ఇచ్చే కమాండ్లకు టెక్ట్స్ రూపంలో సమాధానం ఇస్తుంది. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడం కోసం దీన్ని ప్రారంభించామని, దీని వల్ల బుకింగ్ ప్రక్రియ మరింత సులభతరం కానుందని ఇండిగో 'ఐఫ్లై' (ifly) విభాగానికి చెందిన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుమ్మీ శర్మ అన్నారు. కేవలం కస్టమర్ల ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే కాకుండా సంభాషణల మధ్యలో అచ్చం మనిషిలాగే భావోద్వేగాలను కూడా జోడించడం ఈ ఏఐ చాట్‌బాట్ స్పెషాలిటీ అని తెలిపారు. ఈ సరికొత్త సర్వీసుతో కస్టమర్లు సంతృప్తి చెందడంతో పాటు తమ నిర్వహణ సామర్ధ్యం కూడా మెరుగుపడుతుందని సుమ్మీ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.