ORS For Dehydration:: ఎండలు తట్టుకోలేక ఓఆర్‌ఎస్ తాగుతున్నారా.. ఎలా పడితే అలా తాగకండి.. ఎవరు ఎంత తాగాలంటే..

ABN , First Publish Date - 2023-03-10T16:02:54+05:30 IST

ఎండలు మండుతున్నాయి.. ఎన్నడు లేని విధంగా నగరంలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. ఉదయం తొమ్మిది దాటితే రోడ్లుపైకి రావాలంటే ప్రజలు..

ORS For Dehydration:: ఎండలు తట్టుకోలేక ఓఆర్‌ఎస్ తాగుతున్నారా.. ఎలా పడితే అలా తాగకండి.. ఎవరు ఎంత తాగాలంటే..

నార్సింగ్‌ (ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి.. ఎన్నడు లేని విధంగా నగరంలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. ఉదయం తొమ్మిది దాటితే రోడ్లుపైకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయట తిరిగేవారికి వడదెబ్బ(Sunburn) తగిలే అవకాశం ఉంది. వేడికి శరీరంలోని నీరు చెమట(Sweat) రూపంలో బయటకు పోతుంది. ఫలితంగా శరీరం లవణాలను కోల్పోతుంది. దీంతో కళ్లు తిరగడం, వాంతులు(vomiting), విరేచనాలు(Diarrhea) వంటి ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో ఎండదెబ్బకు ఓఆర్‌ఎస్‌(ORS)తో చెక్‌ పెట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరం నుంచి బయటకు వెళ్లిన లవణాలను ఓఆర్‌ఎస్‌ వెంటనే తిరిగి భర్తీ చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను శరీరం తట్టుకోలేదు. వేడిని క్రమబద్ధీకరించేందుకు మెదడులోని హైపోథలామస్‌ నిరంతరం పని చేస్తూ ఉంటుంది.

తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల హైపోథలామస్‌ పనితీరులో వ్యత్సాసాలు ఏర్పడతాయి. ఫలితంగా తలతిరగడం, నీరసం, తలనొప్పి, వికారం వంటి సమస్యల తలెత్తుతాయి. వీటికి ఓఆర్‌ఎస్‌ విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణం ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలి. ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ ప్యాకెట్లు తీసుకుని ప్రతీ 5 గ్రాముల పౌడర్‌కు 200 మిల్లీ లీటర్ల నీటిని కలపాలి. ఈ ద్రావణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సోడియం, పోటాషియం, క్లోరిన్‌ లవణాలు ఉండి శరీరం నుంచి బయటకు వెళ్లిన లవణాలను భర్తీ చేస్తుంది. ఈ లవణాలలో డేక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. వడదెబ్బకు గురైన వారు ప్రతిపది నిమిషాలకు ఒకసారి ఈ ద్రావణం తాగాలి. అనంతరం వైద్యుడిని సంప్రదించాలి.

సంజీవనిలా...

తీవ్ర ఎండల కారణంగా శరీరం నుంచి నీరు బయటకు పోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌ ఏర్పడుతుంది. దీని నుంచి కాపాడుకోవడానికి ఓరల్‌ రీడిహైడ్రేషన్‌ సాల్ట్‌ (ORS) ద్రావణం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు మందుల దుకాణాల్లో అందు బాటులో ఉంటాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ పొడి, ద్రావణం లభిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. పేదల మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయలేని పక్షంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ను పొందవచ్చు. వడదెబ్బకు గురైన వారికి ఓఆర్‌ఎస్‌ తక్షణ సంజీవనిలా పనిచేస్తోంది.

ఎవరు ఎంత తాగాలి...

రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు రోజుకు 50 నుంచి 100 మిల్లి గ్రాములు ద్రావణం ఇవ్వాలి. 2 నుంచి 10 సంవత్సరాలల లోపు పిల్లలకు 100 ఎంఎల్‌ నుంచి 200 వరకు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రోజు 7 గ్రాసులు ద్రావణాన్ని ఇవ్వాలి. ద్రావణం ఒకసారి కలిపితే 24 గంటల వ్యవధిలో వినియోగించాలి.

మనమే తయారు చేసుకోవచ్చు....

గ్రామీణ ప్రాంతాల్లో మందుల దుకాణాలు అందుబాటులో లేని పక్షంలో ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని ఇంటిలోనూ తయారు చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన నీటిని గ్లాస్‌లో పోసి చిటికెడు ఉప్పు, ఒక చెంచా పంచదార వేసి కలిపి ద్రావణం తయారు చేసుకోవచ్చు. ద్రావణం తయారు చేసిన తరువాత సాధ్యమైనంత త్వరగా దాన్ని ఉపయోగించుకోవాలి. లేకుంటే ఆ నీరు శక్తిని కోల్పోయే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-10T16:02:54+05:30 IST