Budget2023: బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు చివరికి ఏం దక్కాయో తెలుసా..
ABN, First Publish Date - 2023-02-01T15:42:08+05:30
కేంద్ర బడ్జెట్2023లో (Union Budget2023) తెలుగు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు దక్కలేదు. అయితే కంటితుడుపు చర్యగా కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. అవేంటో చూద్దాం..
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్2023లో (Union Budget2023) తెలుగు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు దక్కలేదు. అయితే కంటితుడుపు చర్యగా కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. పలు సంస్థలకు ప్రాధాన్యత దక్కింది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రతిపాదన చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు ప్రకటించింది. ఇక సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.683 కోట్లు చొప్పున నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపాదించింది.
మంగళగిరి, బీబీనగర్ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ.6,835 కోట్లు కేటాయింపు అందివ్వనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొంది. మరోవైపు సాలార్జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు.. మణుగూరు, కోట భారజల కేంద్రాలకు రూ.1,473 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. కాగా కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41,338 కోట్లు, తెలంగాణ వాటా రూ.21,470 కోట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పేరుని కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వైజాగ్ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించలేదు. చాలాకాలంగా ఉన్న డిమాండ్‌ను బడ్జెట్‌లో ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
Updated Date - 2023-02-01T15:53:01+05:30 IST