Asia Cup: వీడు మామూలోడు కాదు.. కోహ్లీ, ధోని రికార్డులను బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్
ABN, First Publish Date - 2023-09-03T17:16:08+05:30
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డులను యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డులను యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. దీంతో టీమిండియా 266 పరుగుల మంచి స్కోర్ సాధించింది. అయితే కెరీర్‌లో ఆడిన మొదటి 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా కిషన్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. కోహ్లీ తన కెరీర్ మొదటి 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 757 పరుగులు చేయగా.. 776 పరుగులతో కోహ్లీ రికార్డును కిషన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ జాబితాలో 778 పరుగులతో శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా ధోనిని కిషన్ అధిగమించాడు. 2008 ఆసియా కప్‌లో పాక్‌పై ధోని 76 పరుగులు చేశాడు. తాజాగా 82 పరుగులతో ధోని రికార్డును కిషన్ బ్రేక్ చేశాడు.
ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నేపాల్‌తో జరగబోయే తర్వాతి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన పల్లెకెలె మైదానంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే భారత్, నేపాల్ పోరులో గెలిచిన జట్టే సూపర్ 4లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూసుకుంటే నేపాల్‌పై భారత్ గెలుపు లాంఛనమే అని చెప్పుకోవాలి. కానీ ఈ మ్యాచ్‌కు కూడా వర్షం నుంచి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరగనున్న సోమవారం పల్లెకెలెలో 80 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కూడా రద్దు అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ మ్యాచ్ రద్దైనా భారత్ సూపర్ 4కు అర్హత సాధిస్తుంది.
Updated Date - 2023-09-03T17:16:08+05:30 IST