IPL 2024: వేలంలో భారీ ధర పలికే సత్తా ఉన్న ఐదుగురు కుర్ర క్రికెటర్లు వీళ్లే!
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:07 PM
IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024 వేలానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన వేలం జరగనుంది. ఈ సారి వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024 వేలానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన వేలం జరగనుంది. ఈ సారి వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీంతో ఈ వేలంలో భారీ ధర పలికే సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరనే ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ అంటేనే టీ20 క్రికెట్‌కు పెట్టింది పేరు. దీంతో యువ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలన్నీ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి. ఈ క్రమంలోనే టాలెంట్ ఉన్న యువ ప్లేయర్లు చిన్న వయసులోనే కోటీశ్వరులైపోతుంటారు. ప్రతి సంవత్సరం వేలంలో పలువురు యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కురిపించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఈ సారి వేలంలో ఫ్రాంచైజీలు కోట్లు కురిపించే అవకాశాలున్న యువ ఆటగాళ్లు ఎవరనే ఆసక్తి నెలకొంది. దీంతో వేలంలో భారీ ధర పలికే సత్తా ఉన్న టాప్ 5 చిన్న వయసుల గల ఆటగాళ్లెవరో ఒకసారి పరిశీలిద్దాం.
రచిన్ రవీంద్ర
ఇటీవల భారత్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో కివీస్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర దుమ్ములేపాడు. 10 మ్యాచ్‌లో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 578 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. 24 ఏళ్ల ఈ కుర్ర క్రికెటర్ మన దేశానికి చెందిన వాడే అనే సంగతి తెలిసిందే. ఇక్కడి పిచ్‌లపై రవీంద్రకు మంచి అవగాహన కూడా ఉంది. ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో రచిన్ రవీంద్ర అంతగా రాణించక పోయినప్పటికీ భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో చెలరేగడంతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్నుపడింది. రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్న రచిన్ రవీంద్ర కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. దీంతో ఈ వేలంలో రచిన్ రవీంద్ర భారీ ధర పలికే అవకాశాలున్నాయి.
గెరాల్డ్ కోయెట్జీ
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అన్రిచ్ నోర్జే గాయంతో జట్టుకు దూరం అవడంతో యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ సౌతాఫ్రికా జట్టులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న 23 ఏళ్ల ఈ కుర్రాడు. 8 మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు పడగొట్టాడు. దీనికి తోడు ఇప్పటికే పలు టీ20 లీగ్‌ల్లో సత్తా చాటాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గెరాల్డ్ గత సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. 9 మ్యాచ్‌లో 8.07 ఏకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో ఈ సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిస టాప్ 3 బౌలర్‌గా నిలిచాడు. రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి దిగుతున్నాడు. ఈ కుర్రాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలుండడంతో భారీ ధర దక్కే అవకాశాలున్నాయి.
ముజీబ్ ఉర్ రెహమాన్
అఫ్ఘానిస్థాన్ స్పిన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది. 22 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ మూడేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అంటే 17 ఏళ్ల వయసులోనే 2018లో ముజీబ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పొదుపుగా బౌలింగ్ చేసి 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సీజన్‌లో పెదగా రాణించకపోవడంతో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ముజీబ్ రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి దిగుతున్నాడు. దీంతో ఫ్రాంచైజీలు ముజీబ్‌ను మంచి ధరకే కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
రెహాన్ అహ్మద్
ఇంగ్లండ్‌కు చెందిన 19 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఈ సారి వేలంలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. రూ.50 లక్షల బేస్ ధరతో వేలంలోకి దిగుతున్నాడు. ఇప్పటికే హండ్రెడ్ లీగ్‌లో రెహాన్ అహ్మద్ తన సత్తా చాటాడు. పొదుపుగా బౌలింగ్ చేసి 9 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో స్పిన్ పిచ్‌లు ఉండడంతో రెహాన్ అహ్మద్‌కు మంచి ధర లభించే అవకాశాలున్నాయి. తమ ప్రధాన స్పిన్నర్ వనిందు హసరంగను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌కు వదిలేసింది. దీంతో ఈ యువ బౌలర్‌ను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ క్రికెటరైన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్‌ను గత సీజన్‌లో రూ.13.25 కోట్ల భారీ ధర వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ అతను అంచనాలు అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. అతని ధర భారీగా ఉండడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే గత ఐపీఎల్ సీజన్‌లో విఫలమైనప్పటికీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జట్టు బ్రూక్ రాణిస్తున్నాడు. ముఖ్యంగా భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2023 హండ్రెడ్ లీగ్ సీజన్‌లో హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. 7 ఇన్నింగ్స్‌లో ఏకంగా 196 స్ట్రైక్ రేటుతో 238 పరుగులు చేశాడు. దీంతో గత ఐపీఎల్ సీజన్‌లో విఫలమైనప్పటికీ ఈ సారి కూడా అతనిపై ఫ్రాంచైజీల కన్ను ఉంది. ఈ సారి కూడా వేలంలో మంచి ధర లభించే అవకాశాలున్నాయి.
Updated Date - Dec 18 , 2023 | 12:07 PM