ENG Vs SA: డిఫెండింగ్ ఛాంపియన్‌కు మళ్లీ షాక్.. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్ ఓటమి
ABN , First Publish Date - 2023-10-21T20:53:50+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 229 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
టీమిండియా గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 229 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యంత ఎక్కువ తేడాతో ఇంగ్లండ్ ఓడిన మ్యాచ్‌గా చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. మార్క్ వుడ్, అట్కిన్సన్ 9వ వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ కొంచెం కోలుకుంది. కానీ 22వ ఓవర్ చివరి బంతికి అట్కిన్సన్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఆలౌటైంది. రీస్ టాప్లీ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఆలౌటైనట్లు అంపైర్ ప్రకటించాడు. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా పాయింట్ల టేబుల్‌లో నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్ మాత్రం 9వ స్థానానికి పడిపోయింది.
ఇది కూడా చదవండి: IPL 2023: ఐపీఎల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా
అంతకుముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ రెజా హెండ్రిక్స్ 75 బాల్స్‌లో 85, వాండర్ డుస్సెన్ 61 బాల్స్‌లో 61, మార్‌క్రమ్ 44 బాల్స్‌లో 42 పరుగులతో రాణించారు. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం సెంచరీతో రెచ్చిపోయాడు. 67 బాల్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి దుమ్మురేపాడు. అతడికి మార్కో జాన్సన్ కూడా జతకలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మిల్లర్ అవుటయ్యే సమయానికి 36.3 ఓవర్లలో 243 పరుగులు మాత్రమే చేసిన దక్షిణాఫ్రికాకు క్లాసెన్-జాన్సన్ జోడీ చివరి 14 ఓవర్లలో దాదాపు 150 పరుగులు జోడించింది. కాగా క్లాసెన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.