Virat Kohli: బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీ టాప్ 8 రికార్డులపై ఓ లుక్కేయండి..
ABN, First Publish Date - 2023-11-05T12:13:41+05:30
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో కింగ్ కోహ్లీకి మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో కింగ్ కోహ్లీకి మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులైతే భారీ ఎత్తున రన్‌మెషీన్ కోహ్లీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్‌లో ఈ రోజు భారత జట్టు సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వన్డేల్లో ఇప్పటికే 48 సెంచరీలు సాధించిన విరాట్ మరొక సెంచరీ కొడితే ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను సమం చేస్తాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. వాటన్నింటి గురించి మాట్లాడుకోవాలంటే ఓ రోజైనా సరిపోయింది. కాబట్టి కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన టాప్ 8 రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం.
1. వన్డే ఫార్మాల్లో వేగంగా 8 వేలు, 9 వేలు, 10 వేలు, 11 వేలు, 12 వేలు, 13 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
2. చేజింగ్ మాష్టర్‌గా పేరున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో లక్ష్య చేధనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. చేజింగ్‌లో 159 వన్డే మ్యాచ్‌ల్లో కోహ్లీ 65 సగటుతో 7,794 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలున్నాయి.
3. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరు మీదనే ఉంది. టీ20ల్లో 4 వేలకుపైగా పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. 115 మ్యాచ్‌లాడిన కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటుతో 4,008 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి.
4. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసింది కూడా విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. 27 టీ20 మ్యాచ్‌ల్లో 81 సగటుతో 1,141 పరుగులు చేశారు. సగటు ఏకంగా 81గా ఉంది. 14 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే టీ20 క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(15)లు, అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(7)లు గెలిచింది కూడా కోహ్లీనే కావడం గమనార్హం.
5. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్‌లలో కలిపి 3 వేలకు పైగా పరుగులు చేసింది విరాట్ కోహ్లీ మాత్రమే. దీంతో అన్ని ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కింగ్ నిలిచాడు. ఐసీసీ ఈవెంట్లలో 73 మ్యాచ్‌లాడిన కోహ్లీ 66 సగటుతో 3,142 పరుగులు చేశారు. ఇందులో 3 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలున్నాయి.
6. కెప్టెన్‌గా టెస్టుల్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అదించింది కోహ్లీనే కావడం గమనార్హం. కోహ్లీ కెప్టెన్సీలో 68 టెస్టు మ్యాచ్‌లాడిన టీమిండియా ఏకంగా 40 మ్యాచ్‌ల్లో గెలిచింది. 11 డ్రా కాగా.. 17 మాత్రమే ఓడింది.
7. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 514 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 54 సగటుతో 26,209 పరుగులు చేశాడు. ఇందులో 78 సెంచరీలు, 136 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 254గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
8. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. ఐపీఎల్‌లో 237 మ్యాచ్‌లాడిన కోహ్లీ 37 సగటుతో 7,263 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలున్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసింది కూడా కోహ్లీనే. అలాగే ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సైతం కోహ్లీ పేరు మీదనే ఉంది. 2016లో 16 మ్యాచ్‌లాడిన విరాట్ ఏకంగా 81 సగటుతో 973 పరుగులు చేశాడు.
Updated Date - 2023-11-05T12:15:14+05:30 IST