World Cup: గుడ్ న్యూస్.. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న హార్దిక్ పాండ్యా.. కానీ..
ABN, First Publish Date - 2023-10-30T16:07:07+05:30
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్‌కు కూడా చేరువైంది.
ముంబై: వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్‌కు కూడా చేరువైంది. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు మరో శుభవార్త. చీలమండ గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే జట్టులో చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న హార్దిక్ టీమిండియా ఆడే తర్వాతి మ్యాచ్‌లోనే జట్టుతో కలిసే అవకాశాలున్నాయని పలు జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. పైగా ఎన్సీఏలో హార్దిక్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని తెలుస్తోంది.
కాగా నవంబర్ 2న శ్రీలంకతో భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ ఆడనుంది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌కు ముందే హార్దిక్ పాండ్యా జట్టులో చేరే అవకాశాలున్నాయి. కాకపోతే అతను మ్యాచ్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే హార్దిక్ జట్టులో చేరే విషయాన్ని ఏన్సీఏ అధికారి ఒకరు ధృవికరించినట్లు సమాచారం. "అవును. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా ముంబైలో జట్టుతో చేరతాడు. కానీ శ్రీలంకతో మ్యాచ్ ఆడతాడో లేదో కచ్చితంగా చెప్పలేము. కాకపోతే హార్దిక్ జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు" అని చెప్పినట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా మ్యాచ్ సమయానికి హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే బరిలోకి దిగొచ్చు. నిజానికి ఇంతకుముందు వరకు హార్దిక్ పాండ్యా నేరుగా నాకౌట్ పోరులోనే బరిలోకి దిగుతాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారాన్ని బట్టి చూస్తే అంతకుముందే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. కాగా అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-10-30T16:07:07+05:30 IST