World Cup: హైదరాబాద్ ఫ్యాన్స్ ప్రేమకు పొంగిపోయాను: బాబర్.. భాగ్యనగరంలో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు!
ABN, First Publish Date - 2023-09-28T11:29:15+05:30
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్ జట్టు లాహోర్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.
హైదరాబాద్: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్ జట్టు లాహోర్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. రాజీవ్‌గాంధీ విమానశ్రయం నుంచి పార్క్ హయత్ హోటల్‌కు వెళ్లింది. పాకిస్థాన్ జట్టు అక్కడే బస చేయనుంది. పాకిస్థాన్ ఆటగాళ్లకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆటగాళ్లు విమానశ్రయం నుంచి తాము బస చేసే హోటల్‌కు వెళ్లే వరకు పోలీసుల భద్రత కొనసాగింది. అయితే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ టీంకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తమకు లభించిన సాదర స్వాగతం పట్ల పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‘‘ హైదరాబాద్ అభిమానులు చూపించిన ప్రేమ, మద్దతుకు పొంగిపోయాను’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపాడు.
కాగా పాకిస్థాన్ జట్టు భారత్‌కు రావడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలి సారి కావడం గమనార్హం. చివరగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఆ తర్వాత మళ్లీ భారత్ రావడం ఇదే మొదటిసారి. ఇక భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి దశాబ్ద కాలం కావొస్తుంది. చివరగా 2012-13లో భారత్ వేదికగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ ఆటగాళ్లలో దాదాపు అందరికీ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆ జట్టు ఆటగాళ్లలో మహమ్మద్ నవాజ్, సల్మాన్ అలీకి మాత్రమే గతంలో భారత్‌లో ఆడిన అనుభవం ఉంది. దీంతో భారత పరిస్థితులు పాకిస్థాన్ ఆటగాళ్లకు సవాల్ విసిరే అవకాశాలు ఉన్నాయి. ఇక తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ నుంచే ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ జట్టు వామప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇక టోర్నీలోని రెండు మ్యాచ్‌లను పాక్ జట్టు హైదరాబాద్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, 10న శ్రీలంకతో ఆడనుంది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 14న తలపడనున్నాయి.
భారత ప్రయాణానికి ముందు కెప్టెన్ బాబర్ అజామ్ పాకిస్థాన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్ కోసం ప్రయాణించడం మాకు గర్వకారణం. ఇంతకుముందు మేము భారత్‌లో ఆడకపోయినా, ఎక్కువగా ఒత్తిడి తీసుకోవడం లేదు. ఇతర ఆసియా దేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో భారత్‌లో అవే పరిస్థితులు ఉంటాయని మేము విన్నాము. ఈ సారి కెప్టెన్‌గా ప్రయాణించడం నాకు గర్వకారణం. మేము ఈ సారి ట్రోఫీతో తిరిగి వస్తామని ఆశిస్తున్నాను. దురదృష్టవశాత్తూ మేము మా అభిమానులను మిస్సవుతాం. కానీ నాకు తెలిసినంతవరకు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. కాబట్టి మేము రద్దీగా ఉండే స్టేడియాల్లోనే ఆడతాము. మా అభిమానులు అక్కడ లేకపోయినా, వారు మమ్మల్ని అభిమానిస్తారని నాకు తెలుసు. భారతదేశంలోని అభిమానులు కూడా మాపై తమ ప్రేమను చూపిస్తారని నేను విన్నాను. అయినప్పటికీ నేను ఇప్పటివరకు దానిని అనుభవించలేదు. ప్రస్తుతం నేను భారత్‌లో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాను" అని అన్నాడు.
Updated Date - 2023-09-28T11:29:15+05:30 IST