సెమీస్‌కు సాత్విక్‌ జోడీ

ABN , First Publish Date - 2023-06-17T01:58:33+05:30 IST

భారత బ్యాడ్మింటన్‌ టాప్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ఇండోనేసియా ఓపెన్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది.

సెమీస్‌కు సాత్విక్‌ జోడీ

ప్రణయ్‌ కూడా..

శ్రీకాంత్‌ అవుట్‌

ఇండోనేసియా ఓపెన్‌

జకార్త: భారత బ్యాడ్మింటన్‌ టాప్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ఇండోనేసియా ఓపెన్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. ఈ స్టార్‌ ద్వయం టాప్‌సీడ్‌కు షాకిచ్చి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఏస్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సింగిల్స్‌లో సెమీస్‌ చేరి ట్రోఫీకి రెండడుగుల దూరంలో నిలిచాడు. ఇక, ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్న కిడాంబి శ్రీకాంత్‌ ఇక్కడా నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో శ్రీకాంత్‌ 14-21, 21-14, 12-21తో ప్రపంచ పదో ర్యాంకర్‌, చైనా షట్లర్‌ లి షి ఫెంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఏడోసీడ్‌ ప్రణయ్‌ 21-18, 21-16తో జపాన్‌ స్టార్‌, మూడోసీడ్‌ నరవొకను యాభై ఐదు నిమిషాల్లో చిత్తుచేశాడు. ఫైనల్‌ బెర్త్‌కోసం టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌)తో ప్రణయ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. అక్సెల్‌సెన్‌ 21-5, 21-19తో ఐదోసీడ్‌ తిన్‌ చెన్‌ చో (చైనీస్‌ తైపీ)ని ఓడించాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్‌ ద్వయం సాత్విక్‌-చిరాగ్‌ 21-13, 21-13తో ఇండోనేసియాకు చెందిన టాప్‌సీడ్‌ జంట ఫజర్‌ అల్ఫియాన్‌-మహ్మద్‌ రియాన్‌ను వరుసగేముల్లో ఇంటికి పంపింది. ఆరంభం నుంచే దీటుగా ఆడిన భారత జోడీ కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి పోరాటానికి ముగింపు పలికింది. కొరియా జంట మిన్‌ హ్యూక్‌-సియోంగ్‌తో సాత్విక్‌ జోడీ సెమీఫైనల్‌ ఆడనుంది.

Updated Date - 2023-06-17T01:58:33+05:30 IST