నెరవేరనున్న ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజల కల

ABN , First Publish Date - 2023-03-01T22:36:41+05:30 IST

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 1: జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. వైద్యవిద్యనందించే మెడికల్‌ కళాశాల కల సాకారమవుతోంది. జిల్లాకు మెడికల్‌ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని అంకుశాపూర్‌లో మెడికల్‌ కళాశాల, 350పడకల ఆస్పత్రి, ల్యాబ్‌ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

నెరవేరనున్న ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజల కల

- వేగంగా మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం

- ఈ విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభించే యోచన

- ఇప్పటికే పరిశీలించి వెళ్లిన ఎన్‌ఎంసీ బృందం

- మే లో మరోసారి పర్యటించనున్న బృందం

- 100 సీట్లతో ప్రథమ సంవత్సరం భర్తీ

- కేంద్ర ప్రభుత్వ అనుమతులే తరువాయి

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 1: జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. వైద్యవిద్యనందించే మెడికల్‌ కళాశాల కల సాకారమవుతోంది. జిల్లాకు మెడికల్‌ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని అంకుశాపూర్‌లో మెడికల్‌ కళాశాల, 350పడకల ఆస్పత్రి, ల్యాబ్‌ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 24గంటలు వైద్య సేవలు, అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలోని పేదలకు ఉచిత వైద్యసేవలు దరిచేరనున్నాయి.

350 పడకల ఆస్పత్రి..

ఆసిఫాబాద్‌ పట్టణం శివారులోని అంకుశాపూర్‌ గ్రామ సమీపంలో 350 పడకల ఆస్పత్రి నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. పది ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనం, ల్యాబరేటరీ, క్లాస్‌రూంలు తదితర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే జిల్లా ఆస్పత్రిగా మారనుంది. ప్రస్తుతం ఉన్న సీహెచ్‌సీని మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చనున్నారు. ఇక్కడ ప్రసూతిసేవలు, నవజాత శిశువులకు వైద్యసేవలు అందించనున్నారు. మిగతా అన్ని వైద్యసేవలు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేయనున్నారు. ప్రసూతి వైద్యసేవలు మినహా అన్నిసేవలు 350పడకల ఆస్పత్రిలోనే లభిస్తాయి.

మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో..

ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో వైద్యుల కొరత తీరనుంది. 24గంటలు వైద్యవిద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులు అందుబాటులో ఉండి వైద్య సేవలు ఆందించనున్నారు. ఆత్యవసరమైన సేవలకు కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండటంతో వైద్యసేవలు అందుతాయి. ఇప్పటికే ఆసిఫాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో పేదలకు ఆర్థికభారం తప్పింది.

పరిశీలించిన ఎన్‌ఎంసీ బృందం..

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) బృందం ఇటీవల పరిశీలించింది. భవన నిర్మాణ పనులు, మౌళిక సదుపాయాలు తదితరాలపై బృందసభ్యులు పరిశీలించి వెళ్లారు. మేలో మరోసారి ఈబృందం పర్యటించి తుది నివేదికలను కేంద్రానికి పంపనుంది. కేంద్రప్రభుత్వ ఆమోదం రాగానే తరగతులు ప్రారంభం కాను న్నాయి. 100సీట్లతో వైద్యకళాశాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకం, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను నియ మించి వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేస్తోంది.

ఏఎంసీ బృందం పరిశీలించి వెళ్లారు:

- స్వామి, సూపరింటెండెంట్‌, సీహెచ్‌సీ, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 350పడకల వైద్యకళాశాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు, మౌళికవసతుల కల్పనపై ఇటీవల ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం సభ్యులు పరిశీలించారు. మేలో మరోసారి ఈబృందం పర్యటించి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. నిర్మాణపనులు పూర్తైతే ఈ ఏడాదిలో 100సీట్లతో వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2023-03-01T22:36:41+05:30 IST