CM KCR: రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం తెల్వదు
ABN, First Publish Date - 2023-11-26T20:10:25+05:30
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కి ఎద్దు, ఎవుసం అంటే తెల్వదని సీఎం కేసీఆర్ ( CM KCR ) సెటైర్లు వేశారు.
సిద్దిపేట : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కి ఎద్దు, ఎవుసం అంటే తెల్వదని సీఎం కేసీఆర్ ( CM KCR ) సెటైర్లు వేశారు. ఆదివారం నాడు దుబ్బాకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాధ సభలోబీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఊడగొట్టింది. కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏళ్ల తెలంగాణ కష్టాలకు కారణం. 1969లో తెలంగాణ కోసం పోరాడిన 400 మంది ఉద్యమ కారులను పిట్టలను కాల్చినట్లు కాల్చింది, ఎమర్జెన్సీ తెచ్చింది. 15 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ప్రజల వద్ద ఉండే ఒక ఒక వజ్రాయుధం ఓటు. మన తలరాత మార్చేది ఆ ఓటే. చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాలి. 2014లో తెలంగాణ వచ్చినంక ఎట్లా ఉండేదో మీకు తెలుసు. కరెంట్, సాగునీరు లేదు, రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం గందరగోళంగా ఉండేది. 2004 తెలంగాణలో ఇస్తామని కాంగ్రెస్ మనతో కలిసి పోటీ చేసింది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మోటార్లు పెడితే డబ్బు ఎవడు ఇవ్వాలి
‘‘కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయినా తెలంగాణ ఇవ్వకుండా మళ్లీ కాంగ్రెస్ దోఖా చేసింది. కాంగ్రెస్ దోఖా చేస్తే.. నాకు తిక్క రేగి కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్షకు దిగితే కేంద్రం దిగివచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీది మళ్లీ అదే మోసం..రైతుబంధు అనే పదాన్ని సృష్టించిందే కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీ. రైతుబంధు దుబారా చేస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి అంటున్నాడు. 24 గంటల కరెంట్ అవసరం లేదు, మూడు గంటలు చాలని అంటున్నాడు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. 10 హెచ్2పీ మోటార్లు పెట్టాలి అంటున్నాడు.. 10 హెచ్ పీ మోటార్లు పెట్టుకుంటారా ? అంత డబ్బు ఎవడు ఇవ్వాలి. కాంగ్రెస్ వస్తే రైతు మెడకు ఉరి తప్పదు.. రైతుబందు తీసేసి.. భూమాత పెడతారట.. అది భూ మాతనా, భూ మేతనా. మూడేళ్లు తల్లాడి ధరణి పోర్టల్ తెచ్చినా. కాంగ్రెస్ నేతలు ధరణిని తీసేసి బంగాళాఖాతంలో పడేస్తానంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్లా పడుతుంది. భూమాత తెచ్చి కౌలు రైతులకు రైతుబంధు ఇస్తారట. ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీ భూములు గోవింద .. మన వేలుతో మన కళ్లే పొడుచుకుందామా’’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో నేను ప్రచారానికి వస్తే కథ వేరేలా ఉందేది
‘‘పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే ఏది గొప్పది కాదు. దుబ్బాకలో చదువుకున్న.. ఇక్కడి నుంచే సీఎంగా ఎదిగాను. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నా, తగినంత పరిణతి రాలేదు. దుబ్బాక ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ఎన్నికలు వస్తే అగం కావద్దు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి వెనక ఉన్న పార్టీల చరిత్ర చూడాలి. ఎవరి చేతిలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలి. ప్రభాకర్‌రెడ్డి పదేళ్లుగా ఎంపీగా ఉన్నాడు. చీమకు కూడా హానీ చేయలేదు. దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా. మనకు కత్తులు లేవా.. అది పద్ధతి కాదు. ఉప ఎన్నికల్లో నేను ప్రచారానికి రాలే.. అప్పుడు వస్తే ఈ కథే ఉండేది కాదు. ఏ పని చేయని మోసగాళ్లు ఉప ఎన్నికల్లో గెలిచారు. 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణలో ఇయ్యలేదు. ప్రతి జిల్లాకు ఒక్క నవోదయ ఇవ్వాలి.. ఒక్కటంటే ఒక్కటీ తెలంగాణకు ఇయ్యలేదు. నేను వీటికోసం వంద ఉత్తరాలు రాసినా. ఒక్కటంటే ఒక్కటి ఇయ్యని బీజేపీ పార్టీకి ఓక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. అసైండ్ భూములు గుంజుకుంటామనడం పచ్చి అబద్ధం.. వారికి పట్టాలు ఇయాలని నిర్ణయించినాం. ప్రభాకర్ రెడ్డి గెలిచినంక నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ తెచ్చుకుందాం. నెత్తిమీద కుండ లెక్క మల్లన్నసాగర్ ఉంది.. దుబ్బాక కు లక్షకు పైగా ఎకరాల్లో సాగునీరు వస్తుంది’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-26T20:22:01+05:30 IST