Purandeswari : దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతోంది!
ABN, First Publish Date - 2023-11-21T18:09:21+05:30
దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుందని.. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) తెలిపారు.
హైదరాబాద్: దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) తెలిపారు. మంగళవారం నాడు కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...‘‘ బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు ఓటు వేసి ఈ ఎన్నికల్లో గెలిపించాలి. ప్రేమ్ కుమార్‌ని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం మద్దతు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరమని ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. బీజేపీ, జనసేన పార్టీలు ప్రజాసమస్యలపై గళం విప్పి పోరాడే పార్టీలు. ఈ పార్టీల అభ్యర్థులను ఆదరిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. నియోజకవర్గంలో ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ మాట తప్పారు. టీఎస్పీపీస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, అదే కార్యాలయం ద్వారా పేపర్ లీక్ అవడంతో అభ్యర్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు’’ అని దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు.
ఆ విషయంలో కేసీఆర్ మాట తప్పారు
‘‘అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని గొప్ప వాగ్దానాలు చేశారు.. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. జీహెచ్ఎంసీలో 9 లక్షల అప్లికేషన్స్ ఉండగా కేవలం 50 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు. పేదవాడి సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారు. దళితులకు భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చలేదు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులకు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయటం లేదు. ఏ హామీ నెరవేర్చారనేది చెప్పి కేసీఆర్ ఎన్నికల్లో ఓటు అడగాలి. దేశంలో 4 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటిలో 3 కోట్ల ఇళ్లను నిర్మించింది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. సబ్ కె సాత్ సబ్ కా వికాస్ బీజేపీ పార్టీతోనే సాధ్యం’’ అని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.
Updated Date - 2023-11-21T20:31:08+05:30 IST