OU students: టికెట్ల ఆశ చూపి చివర్లో తుస్‌మనిపించాయి!
ABN, First Publish Date - 2023-11-16T15:54:51+05:30
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు అన్ని పార్టీలు రిక్తహస్తం చూపించాయి.
టికెట్లిస్తామని ముందు హామీలు
ఆఖరి నిమిషంలో అంచనాలు తారుమారు
ఎన్నికల ముందు నుంచే పలువురు ప్రచారం
కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థిత్వం ఆశించి భంగపాటు
గతంలోని నేతలకే సరిపెట్టిన బీఆర్‌ఎస్
హైదరాబాద్ సిటీ, నవంబర్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు అన్ని పార్టీలు రిక్తహస్తం చూపించాయి. ఎన్నికలకు ముందు టికెట్లు ఇస్తామని హామీలు ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు. చివరి వరకు తీవ్రంగా యత్నించినా టికెట్లు దక్కకపోవడంతో కొందరు మనస్తాపంతో పార్టీలకు దూరంగా ఉంటుండగా, బుజ్జగింపులతో మరికొందరు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కొన్నాళ్లుగా ప్రజల మధ్య తిష్టవేసి టికెట్ కోరినా చివరి నిమిషంలో ఆయా పార్టీలు మొండిచెయ్యి చూపాయి. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించిన పలువురు విద్యార్థి నేతలకు భంగపాటు తప్పలేదు. గతంలో టికెట్లు దక్కిన విద్యార్థి నేతలకే బీఆర్‌ఎస్ మరోసారి అభ్యర్థిత్వాన్ని బలపర్చింది. కొత్తగా పలువురు విద్యార్థి నేతలు ప్రయత్నించినా పట్టించుకోలేదు.
ఓయూ టు అసెంబ్లీ
ఉస్మానియా వర్సిటీతో పాటు తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి నేతల్లో కొందరు చట్టసభల్లో అడుగుపెట్టాలనేది కల. అందుకోసం రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి ప్రయత్నించారు. ఓయూ విద్యార్థి జేఏసీ నేతలకు రాష్ట్రంలో ఉన్న ప్రాధాన్యతను గుర్తించి బీఆర్‌ఎస్ 2014 ఎన్నికల్లోనే ఇద్దరు విద్యార్థి నేతలు బాల్క సుమన్, గాదరి కిశోర్‌లకు టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపింది. 2018 ఎన్నికల్లో వారిద్దరికే టికెట్లు ఇవ్వడంతోపాటు సత్తుపల్లి నుంచి పిడమర్తి రవికి టికెట్ ఖరారు చేస్తే ఓడిపోగా, ఆ ఇద్దరే మళ్ళీ చట్టసభలో అడుగుపెట్టారు. ఈసారి కూడా బీఆర్‌ఎస్ బాల్క సుమన్, గాదరి కిశోర్‌లకు టికెట్లను ఇవ్వగా, మరే విద్యార్థి నేతలకు ఇవ్వలేదు. ఉప్పల్ నుంచి బొంతు రామ్మోహన్, హుజురాబాద్ నుంచి గెల్లు శ్రీనివా్‌సయాదవ్, కంటోన్మెంట్ నుంచి మన్నె క్రిశాంక్ బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు.
కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ
ఓయూకు చెందిన కొందరు విద్యార్థి నేతలను మాత్రమే బీఆర్‌ఎస్ గుర్తించి మరికొందరిని పట్టించుకోకపోవడంతో పలువురు కాంగ్రెస్, బీజేపీల వైపు చూశారు. రాహుల్ గాంధీ పలుమార్లు హైదరాబాద్‌లో సభలు, సమావేశాలకు వచ్చిన సందర్భంలో ఓయూ విద్యార్థి జేఏసీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. తాజా ఎన్నికల్లో కూడా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలకు టికెట్లు ఖరారు కాలేదు. సత్తుపల్లి నుంచి కొటారి మానవతారాయ్, చెన్నూరు నుంచి దుర్గం భాస్కర్, మునుగోడు నుంచి పున్న శ్రీకాంత్, తుంగతుర్తి నుంచి పిడమర్తి రవి, బాలలక్ష్మి తదితరులు టికెట్ల కోసం చివరివరకు ప్రయత్నాలు చేశారు. ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పార్టీ నిర్ణయం మేరకు ఉపఎన్నికలో హుజురాబాద్ నుంచి బరిలో దిగారు. కానీ ఈసారి ఆయనకు ఎక్కడా టికెట్ ఖరారు కాలేదు. పలువురు ఆయా నియోజకవర్గాల్లో కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో విస్తృత సంబంధాలు ఏర్పరచుకున్నారు. కానీ అనూహ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లను ఖరారు చేయడంతో ఓయూ విద్యార్థి నేతలకు నిరాశ ఎదురయ్యింది. కాంగ్రె్‌సలో కొనసాగుతున్న ఓయూ విద్యార్థి జేఏసీ నేతలంతా ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు. పార్టీ మారుతారా ? లేకుంటే పార్టీ అధిష్ఠానం నుంచి హామీతో అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారా ? అన్న సందిగ్ధం నెలకొన్నది. అయితే సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడిన నిరుద్యోగ జేఏసీ నేత కొటారి మానవతారాయ్ కాంగ్రె్‌సకు రాజీనామా చేసి బీఆర్‌ఎ్‌సలో చేరారు.
బీజేపీలోనూ అదే సీన్
ధర్మపురి నియోజకవర్గ టికెట్ గతంలో కాంగ్రెస్ నుంచి ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న ఆశించారు. అప్పట్లో టికెట్ దక్కకపోవడంతో బీజేపీ గూటికి చేరారు. బీజేపీ నుంచి కూడా ధర్మపురి టికెట్ కోసం ఈసారి ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ పార్టీ కూడా రిక్తహస్తం చూపడంతో తిరిగి బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఉస్మానియా వర్సిటీతోపాటు ఏబీవీపీలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నేతలకు టికెట్లను బీజేపీ ఖరారు చేయలేదనే అసంతృప్తులున్నాయి. వరంగల్ నుంచి రాకే్‌షరెడ్డి చివరివరకు యత్నించగా టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎ్‌సలో చేరారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-21T12:15:05+05:30 IST