Ponguleti : ఐటీ, ఈడీ రైడ్స్ తాటాకు చప్పుళ్లకు భయపడం
ABN, First Publish Date - 2023-11-24T23:26:03+05:30
తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.
ఖమ్మం జిల్లా: తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు. శుక్రవారం నాడు నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ... ‘‘రాబోయే కురుక్షేత్రంలో ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో మీరందరూ ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ ప్రజల బాగుకోసం హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని కాదని మాయమాటలు నమ్మి అబద్ధాలు నమ్మి రెండు పర్యాయాలు కేసీఆర్‌కు పట్టం కట్టాం.కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమీ లేదు ఆయన స్వప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రజల సొమ్ము ఎలా దొంగిలించాలని చంద్రశేఖర్‌రావు ఆలోచించారు. BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒకటి కుంగి పోయింది, మరోకటి నెర్రెలు ఇచ్చింది. బీజేపీ, BRS కలిసి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు డ్యామ్‌లు కట్టిన దాంట్లో తప్పు జరిగిందని రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
ఆరు ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబంలో వచ్చాయి
‘‘వారిద్దరిది పెవికాల్ బంధం. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఐటీ, ఈడీ రైడ్స్ అని వివిధ రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు. ఈ సుడిగుండంలో BRS, బీజేపీ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆరు ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబంలో వచ్చాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్‌గా ఇస్తాం. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం కోసం ఇస్తాం. ఇవన్నీ రావాలి కావాలి అంటే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. ఈనెల 30వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ హస్తం గుర్తు పై ఓటేయాలి. కేసీఆర్‌ను రోజు ప్రశ్నిస్తున్నామని ఇక్కడ నన్ను, అక్కడ రేవంత్‌రెడ్డిని ఓడించడానికి కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేకు పంపించాడు. మీ గుండెల్లో ఉన్న శ్రీనన్న హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2023-11-24T23:26:05+05:30 IST