Share News

TS News: దశాబ్దాలుగా రికార్డులు సృష్టిస్తున్న ఎమ్మెల్యేలు వీళ్లే..!

ABN , First Publish Date - 2023-12-07T04:46:15+05:30 IST

దశాబ్దాలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ కొందరు సీనియర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు..

TS News: దశాబ్దాలుగా రికార్డులు సృష్టిస్తున్న ఎమ్మెల్యేలు వీళ్లే..!

  • దశాబ్దాలుగా అప్రతిహత విజయాలతో రికార్డులు..

  • కేసీఆర్‌ 9వ సారి విజయం.. కామారెడ్డిలో ఓటమి

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ కొందరు సీనియర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. 30,40 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ.. ఎన్నికలను శాసిస్తున్నారు. రాష్ట్రంలో 5 కంటే ఎక్కువసార్లు గెలిచిన నేతలు చాలామంది ఉన్నప్పటికీ.. ఐదారు సార్లు గెలిచి కూడా తాజా ఎన్నికల బరిలో దిగిన నేతలు 14 మంది ఉన్నారు. వీరిలో 9 మంది ఈసారి కూడా గెలిచారు. ఐదుగురు సీనియర్లు ఓడిపోయారు. సీఎం కేసీఆర్‌.. సిద్దిపేటలో ఆరుసార్లు, గజ్వేల్‌లో మూడుసార్లు.. మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓడిపోయి, గజ్వేల్‌ నుంచి గెలిచారు. 1983లో సిద్దిపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కేసీఆర్‌ ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి ఎరుగలేదు. 2004, 2009 ఎన్నికల్లో కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశారు.

mlas.jpg

ఏడోసారి గెలిచిన హరీశ్‌, పోచారం..

కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు వరుసగా ఏడోసారి విజయం సాధించారు. 2004 ఉప ఎన్నికలో సిద్దిపేట నుంచి గెలిచిన హరీశ్‌రావు ఆ తర్వాత.. వెనుదిరిగి చూడలేదు. సాధారణ, ఉప ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో హరీశ్‌రావు ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. బాన్సువాడ నుంచి ఆరుసార్లు గెలిచారు. తాజా గెలుపుతో ఏడోసారి విజయం సాధించినట్లయింది. స్పీకర్‌గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో గెలవరనే అపవాదును ఆయన పోగొట్టారు.

ఆరుసార్లు గెలిచిన నాయకులు..

80వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి.. ఇ ప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ.. ఐదు సార్లు గెలిచి, ఆరో విజయం కోసం ఎన్నికల బరిలో దిగిన నేతల జాబితాలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీ, దానం నాగేందర్‌, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఉన్నారు. అక్బరుద్దీన్‌ మినహా.. మిగిలిన నేతలంతా ఉమ్మడి రా ష్ట్రంలో క్యాబినెట్‌ మంత్రులుగా పనిచేసినవారే. ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న తుమ్మల మూడు నియోజకవర్గాల్లో గెలవటం విశేషం. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ నేత తలసాని.. గతంలో సికింద్రాబాద్‌, ఇప్పుడు సనత్‌నగర్‌ నుంచి గెలుపొందారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ.. చంద్రాయణగుట్ట నుంచి వరుసగా ఆరోసారి గెలిచారు. హైదరాబాద్‌కు చెందిన మరో నేత దానం నాగేందర్‌.. ఆసి్‌ఫనగర్‌ నుంచి మూడు సార్లు, ఖైరతాబాద్‌ నుంచి మూడుసార్లు గెలిచారు. మాజీ మంత్రి జూపల్లి.. కొల్లాపూర్‌ నుంచి ఆరు సార్లు గెలిచారు. పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌.. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి ఆరు సార్లు గెలుపొందారు.

ఐదుసార్లు నెగ్గిన నేతలు..

రెండు, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కొందరు నేతలు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు ఐదోసారి విజయం సాధించారు. సబితా ఇంద్రారెడ్డి.. చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి గతంలో నాలుగుసార్లు (2000, 2004, 2009, 2018) గెలుపొందగా.. తాజా గా మహేశ్వరం నుంచి విజయం సాధించారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాలుగు సార్లు(1999, 2004, 2009, 2018) ఎమ్మెల్యేగా గెలిచారు. మంథని నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో ఐదోసారి గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా వరుసగా ఐదోసారి (2009, 2010, 2014, 2018, 2023) సిరిసిల్ల నుంచి గెలుపొందారు. నల్లగొండ అసెంబ్లీ సీటు నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుగుసార్లు(1999, 2004, 2009, 2014) గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచి.. ఇ ప్పుడు నల్లగొండ ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు.

ఆరో ప్రయత్నంలో ఓటమి..

ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏ. చంద్రశేఖర్‌.. వికారాబాద్‌ అసెంబ్లీ సీటు నుంచి ఐదుసార్లు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. సూర్యాపేటకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి గెలిచారు. ఈసారి సూర్యాపేట నుంచి మరోసారి బరిలో దిగినప్పటికీ.. సిటింగ్‌ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

గ్రేటర్‌లో హ్యాట్రిక్‌ వీరులు..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు వరుసగా మూడోసారి గెలిచారు. సికింద్రాబాద్‌ నుంచి నెగ్గిన పద్మారావు, సనత్‌నగర్‌- తలసాని శ్రీనివాస్‌, జూబ్లీహిల్స్‌-మాగంటి గోపీనాథ్‌, రాజేంద్రనగర్‌-ప్రకా్‌షగౌడ్‌, కుత్బుల్లాపూర్‌-వివేకానంద్‌, కూకట్‌పల్లి-మాధవరం కృష్ణారావు, పటాన్‌చెరు-గూడెం మహిపాల్‌రెడ్డి, గోషామహల్‌-రాజాసింగ్‌, కార్వాన్‌ నుంచి గెలుపొందిన కౌసర్‌ మొయినుద్దీన్‌లు 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. హ్యాట్రిక్‌ వీరుల్లో కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేపీ వివేకానంద్‌ తన సమీప ప్రత్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై 85,576 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఈటల, ఎర్రబెల్లి జైత్రయాత్రకు బ్రేక్‌..

తెలంగాణ ఉద్యమంతో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్‌ కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో తొలిసారిగా జయకేతనం ఎగరవేశారు. ఆ తర్వాత 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2021 ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీచేసి గెలిచిన ఈటల.. ఏడోసారి గెలిచారు. 2023 ఎన్నికల్లో హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్‌ నుంచీ ఈటల బీజేపీ తరఫున పోటీచేశారు. కానీ రెండుచోట్ల ఓడిపోయారు. వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఆరు సార్లు గెలిచి ఏడోసారి ఓడిపోయారు. మూడుసార్లు వర్ధన్నపేట నుంచి, మూడుసార్లు పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి.. తాజా ఎన్నికలో పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రెడ్యానాయక్‌ డోర్నకల్‌ నుంచి ఆరుసార్లు గెలిచారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయారు.

9-times-mlas.jpg

Updated Date - 2023-12-07T11:29:05+05:30 IST