TPCC Chief: కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ABN, First Publish Date - 2023-11-03T12:31:55+05:30
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇవ్వలేదన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) సోనియా గాంధీ(Sonia Gandhi) ఇవ్వలేదన్నారు. ‘‘కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట.. మట్టికి పోయిన ఇంటోడు పోవాలని అంటాడు. ఆయన చెప్పినవి ఏవి వచ్చాయి. రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్ ముద్ర ఉంది. త్యాగాలు గుర్తిచేసేలా ఉండాలి కానీ అలా లేదు. ఉద్యమంలో టీజీ అని రాసుకుంటే కేసీఆర్ వచ్చాక టీఆర్‌ఎస్ కనిపించేలా టీఎస్ రాసిండు. తెలంగాణ తల్లి కూడా భుజకీర్తిలతో కనిపిస్తుంది. కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో పాలన తీరు మారింది. ప్రజా సంఘాలకు, అఖిల పక్ష నేతలకు ప్రాధాన్యత లేదు. అసెంబ్లీ హాల్‌లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చిన్రు. మీడియాపై ఆంక్షలు పెట్టారు. సచివాలయంలో కూడా ప్రవేశానికి నో ఎంట్రీ అంటున్నారు. అపోజిషన్ లీడర్లకు అనుమతి ఉండదా. ఉద్యమ సమయంలో కూడా ఎలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎంను ఎవరైనా నేరుగా కలిసే అవకాశం ఉండేది. నియంత కంటే ఎక్కువగా ఉంది కేసీఆర్ పాలన. నియంత కాదు క్రిమినల్ పొలిటిషన్. న్యూ ఫార్మేట్ ఏర్పడింది. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది అర్ధం కావడం లేదు. మేడిగడ్డ కుంగింది, అన్నారం పలిగింది. నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కట్టారు’’ అంటూ విరుచుకుపడ్డారు.
మోడీ కేడీ ఒక్కటే...
టీఎస్‌పీఎస్సీ నిరుద్యోగులను ఆగం చేశారన్నారు. కేసీఆర్ ఇచ్చిన చాలా మాటలు అమలు కాలేదని తెలిపారు. మోసం చేసిన ద్రోహిణితన్ని తరమాలని పిలుపునిచ్చారు. తెలంగాణ దేశానికే ఆదర్శం అని తెలిపారు. ఇప్పుడేమో కర్ణాకటలో ఇది చేస్తలేదు అది చేస్తలేదని అంటున్నారని మండిపడ్డారు. కర్ణాకటలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారని.. మరి బీజేపీ గెలవాలా అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని.. మోడీ కేడీ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు.
2050 ప్రణాళికతో ముందుకు..
పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకొస్తోందని చెప్పుకొచ్చారు. 2050 ప్రణాళికతో ముందుకొస్తున్నామన్నారు. కేసీఆర్ గురించి తాము ఏమి చెప్పనవసరం లేదని.. కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. చివరికి జర్నలిస్టులను కూడా ఆగం చేశారంటూ విరుచుకుపడ్డారు.
తెలంగాణ గురించి మాట్లాడాలంటే...
తెలంగాణ రాష్ట్రం మామూలుగా ఏర్పడలేదన్నారు. చరిత్ర గురించి మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం అని.. అలాగే తెలంగాణ గురించి మాట్లాడాలంటే జూన్ 2, 2014 ముందు, వెనుక అంటామని చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని.. సీమాంధ్రుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం నలిగిపోతుందని పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతదని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని అన్నారు. తెలంగాణ కోసం అణుబాంబు లాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆంధ్రలో పార్టీ సర్వం కోల్పోయినా న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-11-03T12:58:46+05:30 IST