Banda Prakash : బండా ప్రకాశ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2023-02-13T02:32:52+05:30 IST

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం పలువురు మంత్రులు, విపక్ష పార్టీల సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్వయంగా బండా ప్రకా్‌షను చైర్మన్‌ పోడియం వద్దకు తొడ్కొని వెళ్లి సీటులో కూర్చోబెట్టారు.

Banda Prakash : బండా ప్రకాశ్‌   బాధ్యతల స్వీకరణ

మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నిక

సీటులో కూర్చోబెట్టి అభినందించిన సీఎం కేసీఆర్‌

మంత్రులు, మండలి సభ్యుల శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం పలువురు మంత్రులు, విపక్ష పార్టీల సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్వయంగా బండా ప్రకా్‌షను చైర్మన్‌ పోడియం వద్దకు తొడ్కొని వెళ్లి సీటులో కూర్చోబెట్టారు. చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌, మంత్రులు, విపక్ష పార్టీల సభ్యులు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బండా ప్రకాష్‌ ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేస్తూ అభినందించారు. విద్యారంగంలో బలహీనవర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధానంగా ముదిరాజ్‌ సామాజికవర్గం అభ్యున్నతి కోసం చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకా్‌షను రాష్ట్రంలో సేవలు అందించేందుకు రావాలని తానే కోరానని గుర్తుచేశారు.

అనంతరం మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత, కె.జనార్దన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి, మధుసూధనాచారి, పల్లా వెంకట్‌రెడ్డి, వాణీదేవి, బస్వరాజు సారయ్య, గంగాధర్‌గౌడ్‌, మధు, జీవన్‌రెడ్డి, అఫెండీ, ఫరూక్‌హుస్సేన్‌, తదితరులు డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండలి సభ్యులందరికీ ప్రకాశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సభా సంప్రదాయాలను గౌరవిస్తూ నిబంధనలకు అనుగుణంగా మండలిని నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా, డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌ మండలిలోని సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, మండలి చీఫ్‌ విప్‌, విప్‌లుగా అవకాశం కల్పించినందుకు టి.భానుప్రసాద్‌రావు, (శంభీపూర్‌) రాజు, పాడి కౌశిక్‌రెడ్డి సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-02-13T02:32:53+05:30 IST