Wealth: చెత్త నుంచీ సంపద
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:46 AM
ఒకప్పట్లో ఊర్లో చెత్తను శివార్లలో పడేసేవారు. కొండల్లా పేరుకుపోయి దుర్గంధం నెలకొనేది. పర్యావరణ సమస్యతో పాటు స్థానికులూ అనారోగ్యం బారిన పడేవారు. ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో అలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేలా ఏడేళ్ల కిందట సీఎం హోదాలో చంద్రబాబు రూపకల్పన చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వీటిని నిర్లక్ష్యంగా వదిలేయగా.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితం మూడు నెలల్లో జిల్లాలోని పంచాయతీలకు రూ.13.5 లక్షల ఆదాయం వచ్చింది.

కూటమి అధికారంలోకి వచ్చాక పునరుద్ధరణ
తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి: చెత్త నుంచి సంపద సృష్టించాలి. తద్వారా పంచాయతీలకు ఆదాయంతో పాటు గ్రామాలూ పరిశుభ్రంగా ఉండాలి. ఇలా ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో 2019కి ముందే పంచాయతీల్లో సంపద కేంద్రాలను సీఎం చంద్రబాబు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది సాకారం దాల్చే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం సంపద కేంద్రాలను నిర్లక్ష్యం చేసింది. స్వచ్ఛ పల్లెలు అనేది మొక్కుబడిగా మారింది. ఊరి చివరన ఉన్న సంపద కేంద్రాలు మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రూ.వేలల్లో ఖర్చుపెట్టి నిర్మించిన తొట్టెలు శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా చంద్రబాబు ప్రభుత్వం దృష్ట పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి జిల్లాలో చెత్త సంపదకేంద్రాలపై కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టి సారించారు. జిల్లాలో 774 పంచాయతీలున్నాయి. వీటిలో 610 పంచాయతీల్లో యుద్ధప్రాతిపదికన చెత్త సంపద కేంద్రాలను(ఎ్‌సడబ్ల్యూపీసీ షెడ్లు) పునరుద్ధరించారు. కలెక్టర్‌తో పాటు డీపీవో సుశీలాదేవి, ఎస్‌డబ్ల్యూపీసీ జిల్లా కో ఆర్డినేటర్ శిరీష ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. గత మూడు నెలలుగా ప్రతి ఇంటి నుంచి తడి.. పొడి చెత్త విడివిడిగా సేకరించడానికి పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తడి చెత్తతో వానపాముల ఎరువుల తయారీ (వర్మీకంపోస్టు), పొడిచెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. సంపద కేంద్రాలకు చేరే చెత్తను 45 రోజులపాటు తొట్టెల్లో మగ్గపెట్టి తరువాత వర్మీకంపోస్టు తయారు చేస్తున్నారు. మార్కెట్లో కిలో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చదనంతో అత్యంత సుందరంగా చెత్తసంపద కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వర్మీకంపోస్టు ద్వారా రూ.13.5 లక్షలు
జిల్లాలో శానిటేషన్ వర్కర్లు, క్లాప్ మిత్రలు 2,527మంది పనిచేస్తున్నారు. వర్మీకంపోస్టు తయారీలో వీరంతా భాగస్వాములే. గడిచిన మూడు నెలల్లో వర్మీకంపోస్టు అమ్మకం ద్వారా రూ.13.5 లక్షల ఆదాయం పంచాయతీలకు చేకూరింది. కొన్ని పంచాయతీల వారు జాతీయ రహదారులు, గ్రామ కూడళ్లతో పాటు పంచాయతీ కార్యాలయాలు, కలెక్టరేట్‌లోనూ వర్మీకంపోస్టు విక్రయిస్తున్నారు.
ఆదాయాన్ని పంచాయతీలకే కేటాయిస్తున్నాం: వెంకటేశ్వర్, కలెక్టర్
జిల్లాలో 610 పంచాయతీల్లో చెత్త నిర్వహణ కేంద్రాలను అమల్లోకి తెచ్చాం. త్వరలో మిగిలిన వాటినీ వినియోగంలోకి తెస్తాం. మూడు నెలల్లోనే వర్మీకంపోస్టు విక్రయం ద్వారా రూ.13.5 లక్షలు పంచాయతీలకు ఆదాయం వచ్చింది. ఈ ఆదాయాన్ని నాలుగింతలు రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. వర్మీకంపోస్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ పంచాయతీల అభివృద్ధికే కేటాయిస్తాం.