Kuppam: ఆ 44 పోస్టుల భర్తీ ఎన్నడో..!
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:27 AM
మున్సిపల్ కార్యాలయానికి మంజూరు చేసిన 44 పోస్టులు భర్తీ కాకపోవడంతో పని వత్తిడి ఏమాత్రం తగ్గడంలేదు.

‘కుప్పం మున్సిపాలిటీ రూపు మారబోతోంది. అంతర్జాతీయ కన్సెల్టెంట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. యూజీడీ వస్తుంది. ఇంటింటికీ తాగునీటి పైపులైన్ ఇస్తాం. ఎలక్ట్రిక్ తీగలు సైతం భూగర్భంలోనే ఇక ఉండబోతున్నాయి. రెండేళ్లకల్లా మీరు అభివృద్ధి చెందిన కుప్పం మున్సిపాలిటీని చూడబోతున్నారు.’
- కడా పీడీ వికాస్ మర్మత్ ఇటీవల విలేకరుల సమావేశంలో సగర్వంగా చెప్పిన మాటలివి.
‘వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఒకేసారి అనేక సర్వేలు, అభివృద్ధి పనులు, సేవలు అందించాల్సిన పరిస్థితి. దానికి తగ్గ స్టాఫ్ లేరు. ఉన్నవాళ్లతో సర్దుకుపోయే పరిస్థితి కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పైవారికి ఇవ్వాలి. అందుకు సరిపడినంత స్టాఫ్ ఉంటేనే అది సాధ్యమవుతుంది.’
- ఏ మున్సిపల్ ఉద్యోగిని కదిలించినా చెప్పుకుంటున్న గోడు ఇది.
కుప్పం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కుప్పం మున్సిపాలిటీని సిబ్బంది కొరత తీవ్రంగా పీడిస్తోంది. ఇటీవల కొత్తగా డిప్యుటేషన్ మీద వచ్చిన సిబ్బంది విధుల్లో చేరారు. అయితే సుమారు నెలా రెండు నెలల క్రితం కేవలం మున్సిపల్ కార్యాలయానికి మంజూరు చేసిన 44 పోస్టులు భర్తీ కాకపోవడంతో పని వత్తిడి ఏమాత్రం తగ్గడంలేదు. నగర పంచాయతీగా ఉన్న కుప్పానికి పరిసరాల్లోని మరో 6 పంచాయతీలను కలుపుతూ 2020లో పురపాలక సంఘం చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జీవో ఇచ్చినా, అందుకు తగిన నిర్మాణపరమైన చర్యలు మాత్రం తీసుకోలేదు. దీంతో నిన్నమొన్నటిదాకా మున్సిపల్ కమిషనర్ కూడా పంచాయతీ ఈవో హోదాలోనే కొనసాగాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ సిబ్బంది 15 మందితోనే నెట్టుకు వచ్చారు. చివరకు ఆర్థిక శాఖ వద్ద పెండింగులో ఉన్న ఫైలు కదిలి కమిషనర్ పోస్టుతోపాటు, మొత్తం 44 పోస్టులు కుప్పం మున్సిపాలిటీకి మంజూరయ్యాయి. అప్పటికే ఉన్న పంచాయతీ సిబ్బందికి తోడు మున్సిపాలిటీ పరిధిలోని 12 సచివాలయాల్లో 52 మంది సిబ్బంది డిప్యుటేషన్ మీద వచ్చారు. వీరంతా ఇటీవలే రెగ్యులర్ అయ్యారు. వీరుగాక మరో 45 మంది సిబ్బందిని డిప్యుటేషన్ మీద ప్రభుత్వం కేవలం కుప్పం సచివాలయాలకే నియమిస్తూ సుమారు నాలుగైదు రోజుల క్రితం జీవో ఇచ్చింది. ఆయా పోస్టుల్లో నియమితులైన సిబ్బంది కూడా దాదాపు వంద శాతం బాధ్యతలు తీసుకున్నారు.
44పోస్టుల్లో 30 దాకా ఖాళీ
కుప్పం మున్సిపాలిటీకి 44 పోస్టులు మంజూరు చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెల 4వ తేదీన జీవో విడుదల చేసింది. మున్సిపల్ కమిషనర్, మేనేజర్, ఆరు సీనియర్ అసిస్టెంట్, ఆరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులతోపాటు అవసరమైన అన్ని రకాల పోస్టులు మంజూరైన పోస్టుల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు తప్ప అదనంగా ఒక్కరు కూడా ఈ పోస్టుల్లో నియమితులు కాలేదు. మొత్తం 44 పోస్టుల్లో కనీసం 30 పోస్టుల దాకా ఖాళీగానే పడివున్నాయి. జిల్లాలోని ఏ ప్రాంతం వారిని కుప్పం మున్సిపాలిటీకి బదిలీ చేయాలన్నా వీలు కావడంలేదు. ఎవరెవరినో పట్టుకుని కుప్పం బదిలీ కాకుండా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి కుప్పం మారుమూల ప్రాంతం కావడం ఒక్కటే కారణం కాదు. అంతకుమించి ఉద్యోగులు చెబుతున్న కారణం.. పనివత్తిడి. కుప్పం మున్సిపాలిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ప్రధానమైన ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి పనులకోసం కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. నక్ష సర్వేకు ఎంపికైంది. అంతేకాదు.. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రకరకాల సర్వేలు జరుగుతున్నాయి. కుప్పం అభివృద్ధిపై కడా పీడీ ద్వారా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటోంది. వీటన్నింటి వల్ల ఉద్యోగులపై పని వత్తిడి తీవ్ర స్థాయిలోనే ఉంది. కనీసం మంజూరైన పోస్టులు భర్తీ చేసినా పరిమితంగా ఉన్న ఉద్యోగులపై పనిభారంలో కొంత తగ్గుతుంది.కానీ వీరి పనివత్తిడి గురించి తెలుసుకుంటున్న జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు కుప్పం బదిలీ అంటే భయపడిపోతున్నారు. దీనిపై కడా పీడీ వికాస్ మర్మత్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఎఫిషియంట్ ఆఫీసర్స్‌కోసం చూస్తున్నామన్నారు. రెండుమూడు నెలల్లో పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు.