BRS: కేసీఆర్ సభకు సర్వం సిద్ధం.. గులాబీమయమైన నాందేడ్ పట్టణం
ABN , First Publish Date - 2023-02-04T20:50:57+05:30 IST
బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది.

నాందేడ్: బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభాస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షులు, సీయం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితర నేతలు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గత వారం రోజులుగా నాందేడ్‌లో మకాం వేసి ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ... అన్నీ తానై సీయం కేసీఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభ ఏర్పాట్లను చూస్తూనే... విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరఠా వీధుల్లో కలియ తిరుగుతూ వృద్దులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ... తెలంగాణ రాష్ట్రంలో సీయం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీయం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణ అవశ్యకతను తెలియజేస్తూ.... బీఆర్ఎస్ ను ఆధరించాలని కోరుతున్నారు.
మరోవైపు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో మన రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు స్వచ్చంద తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్ తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సభకు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి.
సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం సీయం కేసీఆర్ సభ నేపథ్యంలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సభకు హాజరవుతున్న ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... సభ ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలినడకన మైదానమంతా కలియతిరిగారు. సభా వేదిక అలంకరణ, అతిధులు, ముఖ్య నేతల సీటింగ్ పై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
కేసీఆర్‌తో మహారాష్ట్ర మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ
మరోవైపు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర పథకాలు, దాంతో పాటు తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి మరియు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని ఆహ్వానించిన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు, దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం నేడు ఎంతగానో అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ విధివిధానాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు. తాము పార్టీలో చేరడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు.
కేసీఆర్‌తో భేటీ అయిన వారిలో.. ఛత్తీస్ ఘడ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్య ప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, చత్తీస్ ఘర్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్, సిద్ధిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకుడు అంబటి బాలచంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు.