Kavita :కవితకు ఈడీ నోటీసు!
ABN , First Publish Date - 2023-09-15T04:00:34+05:30 IST
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మళ్లీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కదలిక వచ్చింది.

నేడు విచారణకు రావాలని ఆదేశం
రాష్ట్ర ఎన్నికలు సమీపించిన వేళ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో దూకుడు
ఆర్నెల్ల విరామం తర్వాత మళ్లీ హడావుడి
పిళ్లై అప్రూవర్‌గా మారలేదంటున్న లాయర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మళ్లీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 11న ఒకసారి, ఆ తర్వాత అదే నెల 16, 20, 21 తేదీల్లో ఈడీ విచారణను కవిత ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఆమెను మార్చిలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవితను జైలుకు పంపించబోతున్నామని అప్పట్లో రాష్ట్ర బీజేపీ నేతలు గంభీర ప్రకటనలు చేశారు. తర్వాత ఆర్నెల్లుగా ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి కదలికలు లేకపోవడం, దూకుడుగా ఉన్న బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి మార్చడంతో కేసీఆర్‌తో బీజేపీకి రాజీ కుదిరిందని ఆ పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. అధికారపక్షం బీఆర్‌ఎ్‌సను ఢీకొనే విషయంలో కాంగ్రె్‌సతో పోటాపోటీగా ఉన్న బీజేపీ గ్రాఫ్ ఆ తర్వాత అమాంతం పడిపోయింది. కార్యకర్తల్లో నీరసం ఆవహించింది. కవితను అరెస్టు చేస్తే కానీ తెలంగాణలో మళ్లీ పుంజుకోలేమనే అభిప్రాయాన్ని ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి చెప్పారు. ఢిల్లీ నుంచి నియోజకవర్గాల పర్యటనకు వచ్చిన జాతీయ నాయకులకూ కార్యకర్తల నుంచి అంతే స్ట్రాంగ్‌గా ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కవిత కేసులో కదలిక మొదలవడం గమనార్హం.
కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్తలు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై సౌత్ గ్రూప్‌గా ఏర్పడి ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారని, మద్యం విధానాన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా రూపొందించడానికి గాను ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు చెల్లించారని ఈడీ, సీబీఐ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే, సౌత్ గ్రూపులో సభ్యులుగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అప్రూవర్లుగా మారారు. కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్‌గా మారారని అంటున్నారు. కానీ, అలాంటిదేమీ లేదని పిళ్లై తరఫు న్యాయవాది ప్రకటించారు. సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, ఆ సెక్షన్ కింద వాంగ్మూలం ఇస్తేనే అప్రూవర్‌గా మారినట్లని న్యాయవాది చెబుతున్నారు. అయితే, ఈ నలుగురు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశముంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరఫున అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. ఆ సంస్థలో అరుణ్ పిళ్లైకి ఉన్న వాటాలు కవితవేనని ఈడీ చెబుతోంది. మద్యం విధానం రూపకల్పన సమయంలో ఢిల్లీ ఒబెరాయి హోటల్‌లో జరిగిన సమావేశంలో అరుణ్ పిళ్లై, కవిత పాల్గొన్నారు. హైదరాబాద్ లోనూ సౌత్ గ్రూపు సభ్యుల సమావేశం జరిగినట్లు ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. అప్రూవర్లుగా మారిన వారు కవితకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చినందునే తాజాగా కవితను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వారు ఇచ్చిన వాంగ్మూలాలను, ఈడీ సేకరించిన ఆధారాలను కవిత ముందుంచి అధికారులు ప్రశ్నించే అవకాశముంది.
ఫోన్ డేటా కీలకం
గతంలో కవిత వాడిన ఫోన్లలో నుంచి రిట్రీవ్ చేసిన డేటా దర్యాప్తులో కీలకం కానుందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది మార్చిలో నాలుగు రోజుల పాటు కవితను విచారించిన ఈడీ ఆమె గతంలో వాడిన 11 ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఆ ఫోన్ల నుంచి కీలక డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిసింది. వాటిలో నుంచి ఆయా యాప్‌ల ద్వారా చేసిన చాటింగ్స్‌ను, డాక్యుమెంట్లను ఈడీ వెలికితీసి విశ్లేషించినట్లు సమాచారం. ఆ డేటాను కూడా కవిత ముందుంచి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తొలి నుంచి డిజిటల్ ప్రూఫ్స్‌పై ఆధారపడి ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఈ కేసులో నిందితుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు ఫోన్లను ధ్వంసం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫోన్లలోని డేటా కీలకంకానుంది.