Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు పెట్టండి

ABN , First Publish Date - 2023-08-01T03:26:34+05:30 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో.. మంత్రితోపాటు 2018 ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు

Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు పెట్టండి

అప్పటి ఐఏఎస్‌లు.. ఎన్నికల అధికారులపైనా..

అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం

శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్‌లు మార్చడం చట్టవిరుద్ధం

హైకోర్టుకు తెలిపిన పిటిషనర్‌ రాఘవేంద్రరాజు

కేసు వివరాలు మీడియాకు వెల్లడించరాదని కోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో.. మంత్రితోపాటు 2018 ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు బాధ్యులుగా పనిచేసిన ఐఏఎ్‌సలు, రిటర్నింగ్‌ అధికారులు, ప్రపోజర్స్‌, నివేదికలిచ్చిన డిప్యూటీ కలెక్టర్‌, నోటరీ చేసిన న్యాయవాది తదితరులపైనా కేసు నమోదు చేయాలని సూచించింది. సెప్టెంబరు 11 నాటికి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీచేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేశారని, ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారని మహబూబ్‌నగర్‌కు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు అనే కాంగ్రెస్‌ నేత 2022 ఆగస్టు 4వ తేదీన నాంపల్లి ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు. సీఆర్పీసీలోని సెక్షన్‌ 200 ప్రకారం ప్రైవేటు క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సహా అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌కు అవకాశం ఇచ్చిన అధికారులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తోపాటు అప్పటి జిల్లా ఎన్నికల అఽధికారులుగా వ్యవహరించిన ఐఏఎ్‌సలు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ప్రపోజర్స్‌, నివేదికలు ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్‌, నోటరీ చేసిన వ్యక్తి తదితరులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీచేసిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడ్డవారిపై చట్టబద్ధంగా పోరాడతానని.. ఎంత దూరమైనా వెళ్తానని.. తనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అండ ఉందని మీడియాకు తెలిపారు. కాగా, మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌పై హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌(ఈపీ) వేసింది కూడా రాఘవేంద్రరాజే కావడం గమనార్హం. హైకోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా తాము రెండో అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు ఆదేశాలు ఒకేరోజు రావడం గమనార్హం..!

రెండో అఫిడవిట్‌ను పరిగణిస్తాం: హైకోర్టు

శాసనసభకు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ రాఘవేంద్రరాజు సోమవారం మరోమారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. 2018 ఎన్నికల్లో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అక్రమంగా అఫిడవిట్‌లు మార్చారని కోర్టుకు వివరించారు. ఈ విషయంపై రాఘవేంద్రరాజు 2019లోనే పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే..! ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించి శ్రీనివా్‌సగౌడ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయన భార్య పేరిట ఉన్న భూములు, బ్యాంకు ఖాతాల వివరాలను సరిగ్గా అందజేయలేదని పేర్కొన్నారు. ఒక్కసారి ఎన్నికల అధికారులకు ఇచ్చిన అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవడం అక్రమమని.. వివరాలు సవరించి, రెండోసారి అఫిడవిట్‌ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వెంకటమయూర్‌ వాదనలను వినిపిస్తూ.. శ్రీనివాస్‌ గౌడ్‌ 2018 నవంబరు 14న నామినేషన్‌ పత్రాలతోపాటు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ దాఖలు చేశారని.. నవంబరు 19న ఆ అఫిడవిట్‌ను మార్చి, మరొకటి దాఖలు చేశారని పేర్కొన్నారు. మధ్యలో కల్పించుకున్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో సరైన అఫిడవిట్‌ దాఖలు చేయడంలో తప్పేంముందని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్‌ న్యాయవాది సమాధానమిస్తూ.. కొత్త అఫిడవిట్‌లో కూడా దోషాలున్నాయని.. అఫిడవిట్‌ మార్చడం చట్టవిరుద్ధమని.. ఎన్నిక చెల్లదనడానికి అది కూడా ఒక కారణంగా తాము పేర్కొంటున్నామని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. 2018 నవంబరు 19న దాఖలు చేసిన రెండో అఫిడవిట్‌ ఆధారంగా విచారణ చేపడతామని పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్‌, సాక్షుల వివరాలు, ఆధారాలు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అలాగే కోర్టు కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు చేరవేయరాదని పిటిషనర్‌, మంత్రిని ఆదేశించింది.తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-01T03:26:34+05:30 IST