Government land Possession: సర్కారు భూమి.. దర్జాగా కబ్జా!

ABN , First Publish Date - 2023-01-10T02:51:15+05:30 IST

ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆరు కిలోమీటర్ల దూరం.. బాలానగర్‌-నర్సాపూర్‌ హైవేకు ఆనుకుని ఉన్న ప్రాంతం.. సుమారు రూ.400 కోట్ల విలువైన 44 ఎకరాల ప్రభుత్వ భూమి.. ఒకప్పుడు మాజీ సైనికులకు కేటారచిన ఈ భూమిని కొందరు దర్జాగా కబ్జా చేశారు.

Government land Possession: సర్కారు భూమి..  దర్జాగా కబ్జా!

రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం!

సంగారెడ్డి జిల్లా అన్నారంలోని 44 ఎకరాల భూమి

గతంలోనే మాజీ సైనికులకు కేటాయించిన సర్కార్‌

వారు పొజిషన్‌ తీసుకోకపోవడంతో రద్దు

కబ్జాకు గురైనట్లు సస్పెండైన సర్పంచ్‌ ఆరోపణలు

మంత్రి హరీశ్‌ ఆదేశాలతో యంత్రాంగం సర్వే

సంగారెడ్డి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆరు కిలోమీటర్ల దూరం.. బాలానగర్‌-నర్సాపూర్‌ హైవేకు ఆనుకుని ఉన్న ప్రాంతం.. సుమారు రూ.400 కోట్ల విలువైన 44 ఎకరాల ప్రభుత్వ భూమి.. ఒకప్పుడు మాజీ సైనికులకు కేటారచిన ఈ భూమిని కొందరు దర్జాగా కబ్జా చేశారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, పరిశ్రమల యాజమాన్యాలు కలిసి ఆక్రమించినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ భూమిని తేల్చే పనిలో పడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 261లో ఈ ఆక్రమణ చోటుచేసుకుంది. ఈ సర్వే నంబర్‌లో పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. మొత్తం 588 ఎకరాలలో 315 ఎకరాలు పట్టా భూములు కాగా, 273 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాగా, 273 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 117 ఎకరాలను సుమారు 40 ఏళ్ల కిందట ప్రభుత్వం 108 మంది రైతులకు అసైన్డ్‌ చేసింది. అయితే ఆ భూముల్లో రైతులు పంటలు పండిస్తున్నా అధికార యంత్రాంగం ఇప్పటివరకు వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదు. ధరణి వచ్చాక కూడా భూములను ఆన్‌లైన్‌లో వీరి పేరిట నమోదు చేయలేదు. వీరి సమస్య ఇలా ఉండగా.. ఇదే సర్వేనంబర్‌లోని మిగతా 156 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 119 ఎకరాలను కొన్నేళ్ల క్రితం మాజీ సైనికులకు ఒకసారి 52 మందికి, మరోసారి 21 మందికి సర్కారు కేటాయించింది. అయితే వీరిలో 56 మంది పొజిషన్‌ తీసుకోకపోవడంతో వారికి కేటాయించిన భూమిని ప్రభుత్వం రద్దు చేసింది. 17 మంది మాజీ సైనికులు మాత్రమే తమకు కేటాయించిన 75 ఎకరాలలో పొజిషన్‌లో ఉన్నారు.

ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవడంతో..

56 మంది మాజీ సైనికులకు సంబంధించి రద్దు చేసిన 44 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. ఆ భూమిని కాపాడేందుకు ఎటువంటి రక్షణ చర్యలు కూడా చేపట్టలేదు. దీంతో ఈ భూమిపై కొందరి కన్ను పడింది. ఇదే సర్వే నంబర్‌లో పట్టా భూములను కొనుగోలు చేసిన పరిశ్రమల యాజమాన్యాలు, రియల్టర్లు.. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఈ 44 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత మేర ఆక్రమించినట్టు తెలుస్తోంది. గతంలో పని చేసిన మండల రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన కొందరు రియల్టర్లు కూడా.. తామే మాజీ సైనికులుగా పేర్కొంటూ అక్రమంగా కొంత భూమిని కేటాయింపజేసుకుని వాటిలో వెంచర్లు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు కొద్ది దూరంలోనే ఉండటం, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు శివారులో ఉండడం వంటి కారణాలతో అన్నారం గ్రామ పరిధిలోని భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. ఇక్కడ ఎకరం భూమి ధర రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతోంది. ఈ గ్రామంలో ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్టు భావిస్తున్న 44 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సస్పెండైన సర్పంచ్‌ ఆరోపణలతో..

గత ఏడాది నవంబరులో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సస్పెండైన గ్రామ సర్పంచ్‌ తిరుమల వాసు.. అన్నారంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఆదివారం ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చాయి. రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశాలతో అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి.. సిబ్బందితో కలిసి సోమవారం అన్నారం గ్రామానికి వచ్చారు. స్థానిక ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. సర్వేనంబర్‌ 261లోని 44 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడుందన్న విషయమై సర్వే చేయించడం మొదలుపెట్టారు.

Updated Date - 2023-01-10T02:51:16+05:30 IST