Bhatti Vikramarka: అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క
ABN , Publish Date - Dec 21 , 2023 | 11:47 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్ అవసరమని..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్ అవసరమని.. అలాంటి విద్యుత్ ఉత్పత్తి, ధీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేత పత్రాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పురోగతి, అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలకపాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముకని అన్నారు. వైద్య రంగంలో అత్యవసర సేవలకైనా, రవాణా, సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే ఆర్థిక, నిర్వాహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టిగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్‌కోలో విద్యుత్ సామర్థ్యం 4,365.26 మెగావాట్లుగా ఉందిని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే.. ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పతి ప్రారంభించిన కొత్త విద్యుత్ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 18 వందల మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా యూపీయే ప్రభుత్వం సోనియాగాంధీ నాయత్వంలో ప్రత్యేక నిబంధన చట్టంలో రూపొందించడం జరిగిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ మాత్రమేనని ఈ ప్రాజెక్టులో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించటం వల్ల పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వ్యయంలో కేవలం బొగ్గు సరఫరాకు ఏడాదికి 800 కోట్లు అదనంగా అవుతుందని, రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డిస్కంలు రూ. 81 వేల 516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ. 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ. 28,842 కోట్ల బకాయిలను డిస్కంలకు చెల్లించాల్సి ఉందని, రూ. 14,193 కోట్లు సాగునీటి శాఖ బకాయి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించక పోవటం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగ దీసిందని, దీంతో రోజువారి విద్యుత్ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్న వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్‌ను అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.